Delhi Liquor Scam: అధికార పార్టీ ఎంపీ కుమారుడు అరెస్ట్

by Disha Web Desk 2 |
Delhi Liquor Scam: అధికార పార్టీ ఎంపీ కుమారుడు అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి కోర్టు 10 రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఈ కేసులో ఈడీ రాఘవ రెడ్డిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకుంది. అనంతరం ఇవాళ మధ్యాహ్నం అతడిని సీబీఐ స్పెషల్ కోర్టు ముందు ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో రాఘవరెడ్డి వంద కోట్ల రూపాయల ముడుపు అడ్వాన్స్‌గా ఇచ్చారని, ఇందుకు తగిన సాక్షాలు తమ వద్ద ఉన్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది.

సౌత్ గ్రూప్ ద్వారా ముడుపులు ఇచ్చారని వాదించింది. ఇతను అనేకసార్లు మీటింగ్‌లకు హాజరయ్యాడని ఈ వ్యవహారంలో అతను డీ ఫ్యాక్టో వ్యవహరించారని అధికారులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. శరత్ రెడ్డి పాత్రలాగే మాగుంట రాఘవ రెడ్డి పాత్ర ఉందని రూ.100 కోట్లు రాజకీయ నాయకులకు ఇచ్చారని చెప్పారు. మాగుంట నివాసాలు, ఆఫీస్‌లలో సోదాలు చేసి అనేక ఆధారాలు సేకరించామని ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ చేపట్టాలన్నారు. అందుకోసం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు.

ఈ సందర్భంగా మాగుంట రాఘవ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాఘవ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. మాగుంట రాఘవను జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలి కానీ ఈడీ కస్టడీకి ఇవ్వదని వాదించారు. ఈడీ చట్ట ప్రకారం వ్యవహరించాలే తప్ప కోర్టు తీర్పుల ప్రకారం కాదన్నారు. రాఘవరెడ్డి కేసు దర్యాప్తుకి సహకరిస్తున్నారని అందువల్ల ఈడీ కస్టడీని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నరేష్ కుమార్ లాకా రాఘవరెడ్డిని ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించారు.

Next Story

Most Viewed