చిగురిస్తున్న ఆశలు : తోడల్లుడితో కలిసి జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ

by Disha Web Desk 21 |
చిగురిస్తున్న ఆశలు : తోడల్లుడితో కలిసి జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలతో భేటీలు వెనుక చంద్రబాబు ఉద్దేశం అదేనా? ఇటీవలే అమిత్ షాను కలిసిన చంద్రబాబు తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా భేటీ కావడం వెనుక ఉద్దేశం ఏమిటి? బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు నాయుడు ఈ ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం రోజు రోజుకు రంజుగా మారుతుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల బరిలోకి వైసీపీ దాదాపుగా దిగిపోయింది కూడా. అభ్యర్థుల జాబితాను కూడా దాదాపు ఖరారు చేసేసింది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ సైతం అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు చంద్రబాబు అటు నారా లోకేశ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో ఉంది. ఇందుకు జనసేన,బీజేపీ, పొత్తుల కోసమే అని అందరికీ తెలుస్తోంది. అయితే మెుదట్లో టీడీపీతో పొత్తుకు బీజేపీ ససేమిరా అనడంతో చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి అగ్రనేతలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని పొత్తుల అంశాన్ని ఓ కొలిక్కి తీసుకువస్తారనే ప్రచారం జరుగుతుంది.

నడ్డాతో బాబు భేటీ

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సైతం హాజరయ్యారు. జేపీ నడ్డా పక్కనే కూర్చున్న చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు.. పొత్తుల అంశం, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

తోడల్లుడితో కలిసి చంద్రబాబు

ఇదిలా ఉంటే తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిలతో కలిసి చంద్రబాబు నాయుడు మరోసారి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు నాయుడు ఏదో చెప్తుండగా జేపీ నడ్డా టీ తాగుతూ ఆసక్తిగా వింటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ భేటీలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్ సైతం ఉన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక్కసారిగా తోడల్లుడు చంద్రబాబు పక్కన కూర్చోవడం.. జేపీ నడ్డాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తున్న పరిణామాలు చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో ఏదో జరగబోతుందనే చర్చ అయితే జరుగుతుంది.



Next Story

Most Viewed