వెంకటగిరి వైసీపీలో భగ్గుమన్న అసమ్మతి : నేదురుమిల్లి వర్సెస్ రాంప్రసాద్ రెడ్డి

by Seetharam |
వెంకటగిరి వైసీపీలో భగ్గుమన్న అసమ్మతి : నేదురుమిల్లి వర్సెస్ రాంప్రసాద్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజకవర్గం కంచుకోట. గత ఎన్నికల్లో మాజీమంత్రి పోటీ చేసి గెలుపొందారు. అయితే సదరు మాజీమంత్రి జగన్ కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. పార్టీలైన్ దాటి ఒక్కోసారి సొంత పార్టీపైనా.. ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తూ తల్లో నాలుకలా మెలిగారు. అంతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేసినట్లు ఆరోపిస్తూ సదరు మాజీమంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. అనంతరం మరోకరిని ఇన్‌చార్జిగా నియమించేసింది. మాజీమంత్రి ఏం చెప్పినా చెల్లుబాటు కానీయకుండా ఉన్నతాధికారులకు ఆదేశాలు సైతం ఇచ్చేసింది. అయితే కొత్తగా వచ్చిన ఇన్‌చార్జికీ నియోజకవర్గంలోని వైసీపీ నేతలకు పొసగడం లేదు. దీంతో పార్టీ సీనియర్ నేత ఒకరు కొత్త ఇన్‌చార్జిపై నిప్పులు చెరిగారు. దీంతో వైసీపీకి కంచుకోట అయిన ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఏంటనే ప్రచారం జరుగుతుంది. ఈ కుమ్ములాటలు వైసీపీకి ఏ ముప్పు తీసుకువస్తుందోనని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ పార్టీలైన్ దాటిన సదరు మాజీమంత్రి ఎవరు? కొత్త ఇన్‌చార్జి ఎవరు? కొత్త ఇన్‌చార్జిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ నేత ఎవరు..? ఈముక్కోణపు కుమ్ములాటలకు వేదికైనా నియోజకవర్గం ఏదో తెలియాలంటే తిరుపతి జిల్లా వెళ్లాల్సిందే.

ఆనం కొంపముంచిన విమర్శలు

తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున మాజీమంత్రి, సీనియర్ పొలిటీషియన్ ఆనం రామనారాయణరెడ్డి గెలుపొందారు. జగన్ తొలికేబినెట్‌లోనే బెర్త్ ఆశించి భంగపడ్డారు. అనంతరం కేబినెట్ విస్తరణలోనైనా చోటు దక్కుతుందని ఆశించారు. అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. మంత్రివర్గంలో చోటు దక్కలేదనే అక్కసుతోనో లేకపోతే అధికారుల తీరు నచ్చకనో తెలియదు కానీ ఒక్కోసారి పార్టీకి తలనొప్పులు తెప్పించేలా వ్యవహరించేవారు. పార్టీకి, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెట్టేలా వ్యాఖ్యలు చేసేవారు. అంతేకాదు పార్టీ నేతలపైనా తీవ్ర విమర్శలు చేసేవారు. ఒకసారి సీఎం వైఎస్ జగన్ సైతం జోక్యం చేసుకుని వార్నింగ్ సైతం ఇచ్చారు. అంతేకాదు పార్టీ రీజినల్ ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి సైతం పద్ధతి మార్చుకోవాలని సూచించారు. అయినప్పటికీ సదరు మాజీమంత్రి ఏమాత్రం వెనకడుగు వేయలేదు. నిర్మోహమాటంగా విమర్శలు చేసేవారు. ఇంతలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగెలవాల్సి ఉంది కానీ టీడీపీ అభ్యర్థి అయిన పంచుమర్తి అనురాధ గెలుపొందారు. దీంతో పంచుమర్తి అనురాధకు ఓటేశారని ఆరోపిస్తూ వైసీపీ అధిష్టానం మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై వేటు వేసింది. దీంతో ఆ మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి టీడీపీకి అనుబంధంగా మారిపోయారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో అన్నీ తానై వ్యవహరించారు. ఆనం రామనారాయణరెడ్డిపై వేటు వేయడంతోపాటు వైసీపీ అధిష్టానం ఆనం రామ్ కుమార్ రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించింది. రామ్ కుమార్ రెడ్డి ఇన్‌చార్జిగా దూసుకెళ్లిపోతున్నారు.

రామ్‌కుమార్ రెడ్డిపై సొంతపార్టీలో తిరుగుబాటు

వెంకటగిరి నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమితులైన నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డిపై నెలల వ్యవధిలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. నేదురుమిల్లి ఒంటెద్దుపోకడలతో వ్యవహరిస్తున్నారని నియోజకవర్గం వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ఆరంభం నుంచి ఉన్న నాయకులను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. నేదురుమల్లి తీరు కారణంగా పార్టీలో సమన్వయం లోపించిందని కలిమిలి విమర్శించారు. నేనే రాజు, నేనే మంత్రి, ఈసారి టికెట్ నాదే అంటే కుదరదని రాంప్రసాద్ రెడ్డి దుయ్యబట్టారు. గ్రామగ్రామానా పార్టీ కోసం కష్టపడిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ లేదని కలిమిలి ఆరోపించారు. నియోజకవర్గంలో నేదురుమల్లి నియంతలా వ్యవహరిస్తున్నారని రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేదురుమల్లి ఇలాగే వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కలిమిలి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.

రాంప్రసాద్ రెడ్డి వర్సెస్ రామ్ కుమార్ రెడ్డి

వెంకటగిరి ఇన్‌చార్జిగా రామ్ కుమార్ రెడ్డి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా పోయిందని రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. 25కౌన్సిలర్లను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ప్రతీ దాంట్లో వేలుపెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలో కౌన్సిలర్లు చెప్పింది కాకుండా తాను చెప్పిందే చెయ్యాలంటూ అధికారులను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు తాను పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడినట్లు తెలిపారు. అయితే తన వెంట తిరిగే వైసీపీ నేతలను భయపెట్టడం, బెదిరించడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. మీ ఇష్టానుసారం చేసుకుని పోవడానికి ఇదేమీ మీ రాజ్యం కాదు అని హెచ్చరించారు. వైసీపీకి ఇబ్బంది పెడితే తాను సహించేది లేదని హెచ్చరించారు. ఫీల్ట్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్‌లు, శానిటేషన్ సిబ్బందిని వేధింపులకు గురి చేయడం మానుకోవాలి అని సూచించారు. లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

నేను బరిలో ఉన్నా

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ టికెట్ ఇస్తే తాను పోటీ చేయడానికి సిద్ధం అంటూ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి కంటే తాను వైసీపీలో ముందు నుంచి కొనసాగుతున్నట్లు తెలిపారు. తన మండల పరిధిలో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ గెలుపులో తాను కీలకంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ అభ్యర్థిగా తాను బరిలో ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా తాను కష్టపడి పనిచేస్తానని తెలిపారు. కానీ తనకు, కార్యకర్తలకు ఇబ్బందులకు గురి చేస్తే తాను సహించేది లేదని రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

Next Story

Most Viewed