Amaravati Lands Case: నారాయణ వాంగ్మూలం రికార్డు.. కూతురు, అల్లుడికి నోటీసులు

by Disha Web Desk 16 |
Amaravati Lands Case: నారాయణ వాంగ్మూలం రికార్డు.. కూతురు, అల్లుడికి నోటీసులు
X

దిశ, శేరిలింగంపల్లి: అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసు ఇప్పట్లో మాజీ మంత్రి నారాయణను వదిలేలా లేదు. ఇప్పటికే పలుమార్లు విచారించిన ఏపీ సీఐడీ పోలీసులు తాజాగా సోమవారం ఆయనను గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాస్‌లో ఆయన ఇంట్లోనే విచారించారు. నారాయణతో పాటు ఆయన భార్య రమాదేవి, కుమార్తె షరణి, ఉద్యోగి ప్రమీలను విచారించారు. ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 6న ఏపీ సీఐడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరు కావాలని నారాయణకు నోటీసులు జారీ చేశారు.

అయితే నారాయణ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం నారాయణను, ఆయన కుటుంబ సభ్యులను ఇంట్లోనే విచారించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు నారాయణను విచారించేందుకు వచ్చారు. రాజధానిలో పెద్దయెత్తున బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై ఇప్పటికే పలుమార్లు మంత్రి నారాయణను విచారించారు. అలాగే గతంలో నారాయణ కూతుళ్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించిన పోలీసులు పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.

సోమవారం మరోసారి ఆయన నివాసంలో విచారించి వాంగ్మూలం రికార్డు చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయత్రం 7.30 గంటల వరకు ఈ విచారణ సాగింది. ఈ కేసుపై నారాయణ పెద్ద కుమార్తె, పెద్ద అల్లుడిని కూడా విచారించనున్నారు. ఈనెల 20న విచారణకు అందుబాటులో ఉండాలని నారాయణ పెద్ద కుమార్తె సింధూర, ఆమె భర్త పునీత్‌కు సీఐడీ నోటీసులు అందజేసింది.

Next Story

Most Viewed