నీటి మునక పొలాల్లో నల్లమట్టి తరలింపు

by Disha Web Desk 7 |
నీటి మునక పొలాల్లో నల్లమట్టి తరలింపు
X

మట్టి మాఫియాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేస్తూ మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటోంది. అనుమతుల పేరు చెప్పి అందిన కాడికి దోచుకుంటోంది. ఖాళీ స్థలాలు, పోరంబోకు, ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసుకుని దందా సాగించే మాఫియా.. ప్రస్తుతం భవనాశి నది పక్కనున్న నీటి మునక పొలాల్లోని సారవంతమైన నల్లమట్టిపై కన్నేసింది. అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో జర్నలిస్టుల స్థలాల్లోకి చొరబడింది.

దిశ, కర్నూలు ప్రతినిధి : జిల్లా కేంద్రానికి సమీపంలోని దిన్నెదేవరపాడు, కల్లూరు మండలంలోని లక్ష్మీపురం రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 590 ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి. అందులో ప్రసిద్ధి చెందిన జగన్నాథ గట్టు, త్రిఫుల్ ఐటీ కళాశాల, ప్రభుత్వ క్లస్టర్ యూనివర్శిటీని నిర్మించారు. 2009లో అప్పటి ప్రభుత్వం ది కర్నూలు జర్నలిస్టు మ్యూచువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీకి జగన్నాథ గట్టుపై సర్వే నెంబర్ 478లో 15 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది.

వాటిలో ఒక్కో జర్నలిస్టుకు 3.50 సెంట్ల చొప్పున 254 మంది జర్నలిస్టులకు ప్లాట్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసింది.అయితే అక్కడ కొండ ప్రాంతం జర్నలిస్టులు ఇంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో అధికార పార్టీ నేతల అండదండలు, పోలీసు, మైనింగ్, రెవెన్యూ శాఖలతో కుమ్మక్కై మట్టిని కొల్లగొడుతున్నారు. 60 నుంచి 70 ప్లాట్ల వరకు గల ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. దీంతో అక్కడ 20 అడుగుల లోతు వరకు గుంతలు ఏర్పడ్డాయి. దీనిపై జర్నలిస్టు సంఘాలు మండి పడుతున్నాయి.

నంద్యాల జిల్లాలో..

కొత్తపల్లి పగిడ్యాల మండలాలకు మధ్య ఎర్రమఠం సంకిరేణిపల్లె, అలాగే జడ్డువారిపల్లె, పోతిరెడ్డిపాడు మధ్యలో భవనాశి నది వద్ద పాములపాడు మండల కేంద్రానికి చెందిన టీఎన్ఆర్ రాయలసీమ ఎత్తిపోతల కాల్వను ఆనుకుని మట్టి తవ్వకాలు చేపట్టారు. ఈ నల్లమట్టి సారవంతమైనది కావడంతో రైతులు తమ పొలాలకు ఈ మట్టిని తరలించుకుంటున్నారు. అందుకుగానూ సమీపంలో పది కిలోమీటర్ల దూరంలో ఉండే మాడుగుల, ఎర్రమఠం, ముసలిమడుగు, జడ్డువారిపల్లె, కొక్కెరంచ వంటి ప్రాంతాలకు ట్రిప్పు రూ.2 వేలు, పాములపాడు, జూపాడుబంగ్లా, తూడిచెర్ల వంటి తదితర సుదూర ప్రాంతాలకు ప్పు రూ.8 వేల నుంచి రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి రోజూ రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఇప్పటికే ఎత్తిపోతల కోసం చేపట్టిన కాల్వను కూడా తవ్వడం, నీటి మునక పొలాల్లో మట్టిని పెకిలించడంతో సమీపంలో ఉండే భవనాశి నది కనుమరుగయ్యే అవకాశాలున్నాయి.

నిబంధనలు తూచ్..

మిడుతూరు మండలంలోని సుంకేసుల, జలకనూరు, కాజీపేట, చింతలపల్లి గ్రామాల పరిధిలో గల మద్దిగుండం చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టారు. ప్రభుత్వానికి చెల్లించేది క్యూబిక్ మీటర్ కు ఒక రూపాయి చెల్లించి అదే మట్టిని రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండల కేంద్రానికి సమీపంలో తువ్వపల్లె తిప్పపై కొందరు అక్రమార్కులు జేసీబీలను ఉపయోగించి ట్రాక్టర్ల ద్వారా ఎర్రమట్టిని పక్క మండలాలకు తరలించేస్తున్నారు. ఈ తువ్వపల్లి తిప్ప కొన్ని వందల ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడింది. మట్టి మాఫియా వల్ల ఇది చెరిగిపోతుంది.

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎర్ర, నల్లమట్టి తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న సంబంధిత అధికారులు ఏనాడూ స్పందించిన దాఖలాల్లేవు. అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలు, సంబంధిత అధికారులకు మామూళ్లు అందడంతో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా మట్టి మాఫియాకి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed