‘అల్ జజీరా’పై ఇజ్రాయెల్ నిషేధం: అధ్యక్షుడు నెతన్యాహు కీలక నిర్ణయం

గాజాపై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-05-05 13:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖతర్‌కు చెందిన న్యూస్ చానల్ ‘ఆల్ జజీరా’పై నిషేధం విధించారు. ఇజ్రాయెల్‌లో ఆ చానల్‌ను మూసి వేస్తున్నట్టు ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘ఖతార్ టెలివిజన్ నెట్‌వర్క్ ఆల్ జజీరా జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోంది. గాజాలో యుద్ధం ఆగిపోయేవరకు ఇజ్రాయెల్‌లో అల్ జజీరా కార్యకలాపాలను నిలిపివేస్తున్నాం. ఇజ్రాయెల్ కేబినెట్ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది’ అని పేర్కొన్నారు. ‘అల్ జజీరా రిపోర్టర్లు ఇజ్రాయెల్ భద్రతకు హాని కలిగించారు. అంతేగాక మా సైనికులను రెచ్చగొట్టారు. కాబట్టి ఇజ్రాయెల్ నుంచి హమాస్ తరఫున మాట్లాడేవారిని తొలగించాల్సిన సమయం ఇది’ అని తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.

దీంతో ఇజ్రాయెల్‌లోని అల్ జజీరా ఆఫీసులు మూతపడటంతో పాటు, దాని ప్రసార పరికరాలను జప్తు చేయడం, శాటిలైట్ కంపెనీల నుంచి చానల్‌ బ్లాక్ చేయడం వంటివి ఉంటాయి. కాగా, ఆల్ జజీరాకు ఖతర్ నుంచి నిధులు అందుతున్నట్టు తెలుస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యను సైతం ఆ చానల్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు నిషేధం విధించినట్టు సమాచారం. జాతీయ భద్రతకు ముప్పుగా భావించే విదేశీ ప్రసారాలను ఇజ్రాయెల్‌లో తాత్కాలికంగా మూసివేయడాన్ని అనుమతించే చట్టాన్ని ఆ దేశ పార్లమెంట్ గత నెలలోనే ఆమోదించింది.

ఈ వ్యవహారంపై ఆల్ జజీరా స్పందించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాల్లోని అల్ జజీరా చీఫ్ వాలిద్ ఒమరీ మాట్లాడుతూ..ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రమాదకరమని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇజ్రాయెల్ డిసిషన్ ను సవాల్ చేస్తూ కోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉందని తెలిపారు. తమ న్యాయ బృందం ఆ ప్రయత్నంలోనే ఉందని చెప్పారు. కాగా, గాజాలో దాడులను ఆపేందుకు ఈజిప్టు, యూఎస్‌లు ఇజ్రాయెల్ హమాస్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలోనే ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. 

Tags:    

Similar News