పాక్ అడుక్కు తింటోంది.. మోడీ

దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏదైనా చేసే ముందు వందసార్లు ఆలోచిస్తారని అన్నారు ప్రధాని మోడీ. హర్యానా అంబాలాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

Update: 2024-05-18 14:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు ఏదైనా చేసే ముందు వందసార్లు ఆలోచిస్తారని అన్నారు ప్రధాని మోడీ. హర్యానా అంబాలాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పాక్ ని ఉద్దేశించి ఇటీవల పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. దేశంలో ‘ధాకడ్ సర్కార్’ ఉంటే ఏదైనా చేయగలమని అన్నారు. ప్రస్తుతం పాక్ ను అదే విషయం కలవరపెడుతోందన్నారు. గత 70 ఏళ్లుగా పాక్ భారత్ ను ఇబ్బందిపెడుతోందన్నారు. పాక్ చేతిలో గతంలో బాంబులు ఉండేవని.. ప్రస్తుతం భిక్షపాత్ర ఉందని ఎద్దేవా చేశారు. ఇదంతా బలమైన సర్కార్ వల్లే సాధ్యమైందని.. ధాకడ్ సర్కార్ ని చూసి శత్రువులు ఇలానే వణికిపోతారని అన్నారు.

బలహీనమైన ప్రభుత్వం ఉంటే జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితిని మార్చగలిగేదా..? అని ప్రశ్నించారు. బలమైన ప్రభుత్వమే ఆర్టికల్ 370ని బద్ధలు కొట్టిందని అన్నారు. జమ్మూ కశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉందని అన్నారు. హర్యానా ప్రజల నరనరాల్లో దేశభక్తి ప్రవహిస్తోందని అన్నారు. దేశవ్యతిరేక శక్తులను హర్యానా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే హర్యానాలోని ప్రతి ఇల్లు “ఫిర్ ఏక్ బార్.. మోడీ సర్కార్" అంటుందని అన్నారు. ఇకపోతే, హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి.

పీఓకేని భారత్ స్వాధీనం చేసుకుంటుందని ఇటీవలే బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ స్పందించారు. పాక్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని.. మనం వారిని గౌరవించాలని పేర్కొన్నారు. లేకపోతే భారత్‌పై పాక్ అణుబాంబు ప్రయోగించాలని ఆలోచిస్తుందని కామెంట్స్ చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ పీఓకేని తీసుకుంటే పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదని.. వారి వద్ద అణుబాంబులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. వీటిని ఉద్దేశించే.. అంబాలా ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Similar News