పాక్‌లో నిరాశ్రయులకు ఆశ్రయమిస్తున్న హిందు ఆలయం

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో భారీ వర్షాలతో పోటెత్తిన వరదలతో దేశప్రజలంతా అల్లకల్లోలం అయ్యారు.Latest Telugu News

Update: 2022-09-11 13:32 GMT

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో భారీ వర్షాలతో పోటెత్తిన వరదలతో దేశప్రజలంతా అల్లకల్లోలం అయ్యారు. చాలా ప్రాంతాలు జలమయం కావడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి సమయంలో అల్లాడుతుంటే బాలోచిస్తాన్‌లోని చిన్న గ్రామంలో ఓ హిందు ఆలయం పునరావాస కేంద్రంగా మారింది. చెల్లాచెదురైన వారికి ఆశ్రయాన్ని అందిస్తూ వారి ఆకలిని తీర్చుతుంది. సుమారు 200-300 వరకు వరద ప్రభావిత ప్రజలకు ఆవాసంతో పాటు ఆహారాన్ని కూడా ఈ ఆలయం అందిస్తుంది. వీరిలో ఎక్కువగా ముస్లింలే ఉండటం గమనార్హం. ఎత్తైన ప్రాంతంలో ఉండడంతో జలాల్ ఖాన్ గ్రామంలోని బాబా మదోదాస్ మందిర్ ప్రజలకు ఆశ్రయాన్ని కల్పిస్తుంది.

గ్రామ చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాలు వరద ప్రభావానికి గురి కావడంతో నిరాశ్రయులకు సాయంగా ఉండడానికి మందిరాన్ని తెరిచే ఉంచారు. స్థానికుల కథనం ప్రకారం బాబా మధోదాస్ హిందు దేవదూతగా పేరొందాడు. కులం, మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అందరికీ సమ ప్రాధాన్యత ఇచ్చేవాడని స్థానికులు చెప్పారు. అయితే ఉద్యోగం, ఇతర అవకాశాల కోసం చాలా మంది ఈ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. కొన్ని కుటుంబాలు మాత్రమే ఆలయ పరిసరాల్లో నివసిస్తున్నాయి. ఆలయంలో 100కు పైగా గదులు ఉండడంతో ఏటా పెద్ద ఎత్తున బాలోచిస్తాన్, సింథ్ ప్రాంతం నుంచి భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. వరదలతో కొన్ని గదులు ధ్వంసమైనా, చాలా భాగం సురక్షితంగానే ఉందని కథనంలో పేర్కొంది. ఈ క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిరాశ్రయులైనా వారికి ఆశ్రయాన్ని కల్పిస్తూ, ఆకలిని తీర్చుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Similar News