Uttam Kumar Reddy: రాజగోపాల్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

Uttam Kumar Reddy Meets Komatireddy Rajagopal Reddy| కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ బుజ్జగింపులు కంటిన్యూ చేస్తోంది. శనివారం ఉదయం రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

Update: 2022-07-30 06:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : Uttam Kumar Reddy Meets Komatireddy Rajagopal Reddy| కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ బుజ్జగింపులు కంటిన్యూ చేస్తోంది. శనివారం ఉదయం రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఉత్తమ్ పార్టీ మారకుండా ఉండేందుకు ఆయనతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో పట్టున్న నేతను వదులుకోవద్దనే ఉద్దేశంతో ఇప్పటికే భట్టి విక్రమార్కతో ఓ సారి రాయబారం సాగించిన పార్టీ అధిష్టానం.. తాజాగా ఆ బాధ్యతను ఉత్తమ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ఆదేశాలతో రాజగోపాల్ రెడ్డితో ఉత్తమ్ మంతనాలు కొనసాగిస్తున్నారు. తన పార్టీ మారే విషయంలో శుక్రవారం సాయంత్రం బహిరంగ లేఖను రాజగోపాల్ రెడ్డి విడుదల చేశారు. సబ్బండ వర్గాల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ సొంత ఆస్తిగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు త్వరలోనే మరో కురుక్షేత్ర యుద్ధానికి శంఖం పూరిస్తానని ప్రకటించారు. ఈ లేఖను రాసిన మరుసటి రోజే రాజగోపాల్ రెడ్డి నివాసానికి ఉత్తమ్ వెళ్లడం ఆసక్తిగా మారింది. తాజా మంతనాలతో ఆయన తన మనసు మార్చుకుంటారా లేక బీజేపీలోకి వెళ్లేందుకే ఇష్టపడతారా అనేది త్వరలో తేలనుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరే విషయంలో బీజేపీలోను జోరుగా చర్చ సాగుతోంది. పార్టీలో చేరే విషయంలో ఇప్పటికే బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి ముఖ్యనేతలు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ను పార్టీలో చేర్చుకోవడంపై బీజేపీ సైతం గట్టి పట్టుదలతోనే ఉంది. ఒక వేళ రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఉప ఎన్నిక తప్పదనే భావనతో ఉన్న టీఆర్ఎస్ ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి టాపిక్ రాష్ట్ర రాజకీయాలను పూట పూటకు మరింత రసకందాయంలో పడేస్తోంది.

ఇది చివరి ప్రయత్నమా?

పార్టీ మారే విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నాడనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ హైకామాండ్ రాజగోపాల్ రెడ్డి ఇంటికి దూతను పంపడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ఆయన చేజారి పోకుండా చేసే ప్రయత్నాల్లో ఇదే ఆఖరి ప్రయత్నంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీలో ఉంటే సముచిత స్థానంతో గౌరవిస్తామనే సంకేతాలను ఇప్పటికే ఇచ్చిన హైకమాండ్ ఒక్క సారి ఆలోచించాలనే సమాచారాన్ని రాజగోపాల్ రెడ్డికి చేరవేస్తోంది. పార్టీ ఎన్నో అవకాశాలను కల్పించింది, కష్టకాలంలో పార్టీని ఇబ్బందిపెట్టేలా వ్యవహరించవద్దని రాజగోపాల్ రెడ్డితో పార్టీ సీనియర్లను నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒక వేళ పార్టీ మారితే భవిష్యత్ లో పార్టీపై నిందరాకుండా చివరి ప్రయత్నాల్లో భాగంగా తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైకమాండ్ ప్రయోగించిందనే ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి:

వివాదంలో ఎమ్మార్డీసీ చైర్మన్ ఢిల్లీ ప‌య‌నం.. పీకే రిపోర్ట్ ఎఫెక్టేనా..?

Tags:    

Similar News