ఏనుమాములకు ఎవరొస్తారో..?

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పెద్ద కుర్చీలే ఖాళీ అవుతున్నాయి. ఉన్నతశ్రేణి కార్యదర్శితో పాటు గ్రేడ్‌ 2 కార్యదర్శి పోస్టులు రెండూ ఒకేసారి ఖాళీ కానున్నాయి.

Update: 2024-04-28 14:40 GMT

దిశ, వరంగల్‌ టౌన్ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పెద్ద కుర్చీలే ఖాళీ అవుతున్నాయి. ఉన్నతశ్రేణి కార్యదర్శితో పాటు గ్రేడ్‌ 2 కార్యదర్శి పోస్టులు రెండూ ఒకేసారి ఖాళీ కానున్నాయి. ఆ స్థానాల్లో కొనసాగుతున్న క్యారం సంగయ్య, ఎండి బియాబానీ ఉద్యోగ కాలం ఈ నెలాఖరుతో పూర్తి కానుంది. ఏప్రిల్‌ 30న ఇద్దరూ రిటైర్‌ కానున్నారు. ఈ మేరకు 29న బియ్యాబానీకి, 30న సంగయ్యకు వీడ్కోలు పలికేందుకు భారీ ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి.

ఆరోపణల మధ్య విరమణ..

ఉన్నతశ్రేణి కార్యదర్శి సంగయ్య దాదాపు మూడు నెలల క్రితమే ఆయన ఏనుమాముల మార్కెట్‌ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడే పని చేసిన సంగయ్య.. పలు కారణాలతో బదిలీ అయ్యారు. అనంతరం రాహుల్‌ను ఇన్‌చార్జ్‌ కార్యదర్శిగా నియమించారు. డిసెంబర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక..జనవరిలో రాహుల్‌ బదిలీ కాగా, ఆయన స్థానంలో తిరిగి సంగయ్య నియమితులయ్యారు. ఆయన వచ్చిన కొద్ది రోజుల నుంచే మార్కెట్‌లో అక్రమాలు మరింత జోరందుకున్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. పలు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయినా.. సంగయ్యతో సహా ఉన్నతాధికారులు ఎవరూ మార్కెట్లో బాగోతాలపై స్పందించలేదు.

అందుకు గల కారణాలు అనేకం ఉన్నప్పటికీ.. ప్రధానంగా సంగయ్య రిటైర్‌మెంట్‌ స్థాయిలో ఉన్నాడని, అంతేకాకుండా ఆయన ఆరోగ్యం బాగోలేదనే ప్రచారం మధ్య.. సంగయ్య కేవలం సంతకాలకే పరిమితమయ్యాడనే చర్చల మధ్య ఉన్న కాలం కాస్త గడిచిపోయింది. రిటైర్‌మెంట్‌ వయస్సు రానే వచ్చింది. ఆయన ఉన్నంతకాలం అక్రమాలతో వెనకేసున్న వారంతా కలిసి రేపు ఏర్పాటు చేయనున్న వీడ్కోలు సభలో ఆయనకు భారీగానే కట్నాలు, కానుకలు సమర్పించుకోనున్నారనే టాక్‌ నడుస్తోంది.

ఇక కార్యదర్శి పోస్టుకు పోటాపోటీ...

సంగయ్య రిటైర్‌మెంట్‌తో ఆ స్థానంలో కూర్చునేందుకు ఇప్పటికే పలువురు కన్నేసినట్టు తెలుస్తోంది. సూర్యాపేట నుంచి ముక్రం, ఖమ్మం నుంచి నిర్మల, హుజూర్ నగర్ మల్లేశం, ప్రవీణ్ రెడ్డి, హుజురాబాద్ నుంచి జిరెడ్డి, కరీంనగర్ నుంచి పద్మావతి తో పాటు మరికొంత మంది ఏనుమాముల ఉన్నతశ్రేణి కార్యదర్శి పోస్టును దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతమంది ఒక్క పోస్టుకు ఎగబడుతున్నారంటే.. ఆ ఉద్యోగ హోదాకు ఎంత పవర్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇదిలా ఉండగా, ఎన్నికల కోడ్ సందర్భంగా ప్రస్తుతానికి డీఎంవో ప్రసాద్‌రావుకు కొంతకాలం ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలకవర్గం పదవీకాలం ముగిసి.. ప్రత్యేక ఇన్‌ఛార్జిగా జేడీఎం మల్లేషను నియమించారు. తాజాగా కార్యదర్శి పోస్టులో కూడా ఇన్‌చార్జ్‌ రానుండడంతో ఏనుమాములకు మరిన్ని రోజులు ఇన్‌చార్జ్‌లతో కాలం గడపాల్సిన పరిస్థి తి నెలకొంది.

Similar News