జిల్లాల సరిహద్దుల మార్పుకు డేట్ ఫిక్స్.. జనగణనకు ఇబ్బంది లేదు

Update: 2022-02-28 11:01 GMT

దిశ, ఏపీ బ్యూరో : కొత్త జిల్లాల ఏర్పాటు అంశానికి సంబంధించి ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలు, విమర్శలపై చర్చిస్తున్నట్లు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. అన్ని జిల్లాల నుంచి అభ్యంతరాలను సేకరించామని ఆయన తెలిపారు. మొత్తం అన్ని జిల్లాల నుంచి సేకరించిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలపై ఒక నివేదిక సమర్పించి దాన్ని సీఎంకు అందజేస్తామని విజయ్ కుమార్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్‌లో తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల నుండి వచ్చిన ప్రజల సూచనలు, సలహాలు, విమర్శల పై చర్చించినట్లు విజయ్ కుమార్ తెలిపారు. నాలుగు జిల్లాల కలెక్టర్ల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు.

రంపచోడవరాన్ని రాజమహేంద్రవరంలో కలపాలని, నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా చెయ్యాలని, పార్వతీపురాన్ని జిల్లా పేరుగా ఉంచాలని..  తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం దగ్గరగా ఉన్న మండపేట లాంటి వాటిని రాజమహేంద్రవరం జిల్లాలోనే కలపాలని డిమాండ్లు వచ్చినట్లు కలెక్టర్లు వివరించినట్లు విజయ్ కుమార్ తెలిపారు. అయితే ఐటీడీఏ ప్రయోజనాలు పొందే ప్రాంతాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ ఉందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.

విశాఖ నుండి 300, విజయనగరం నుండి 4000, తూర్పుగోదావరి జిల్లా నుంచి 40,  శ్రీకాకుళం నుండి 40 అభ్యంతరాలు వచ్చాయని వివరించారు. జిల్లాల ఏర్పాటు వల్ల విశాఖ ప్రాధాన్యత తగ్గదని.. అయితే జీవీఎంసీ ఒకటి బదులు రెండు జిల్లాల్లో విస్తరించి ఉంటుందని వివరించారు. జూన్ 30 లోపు జిల్లాల సరిహద్దుల మార్పు చేసుకోవచ్చని, జనగణనకు ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చారు. క్రొత్త జిల్లాల్లో పాలనా భవనాలు ఏర్పాటు చేయబోతున్నామని, 90శాతం వరకు ప్రభుత్వ భవనాల నుండే పాలన జరుగుతుందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు.

Tags:    

Similar News