'పరిధిలు తెలుసుకొని మాట్లాడాలి'.. గవర్నర్‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్​ వ్యవస్థ దేశంలో అవసరమే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సంచలన..latest telugu news

Update: 2022-04-09 13:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్​ వ్యవస్థ దేశంలో అవసరమే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్​లో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ రాజ్యాంగ పరమైన హోదాలో ఉన్నారని, వారి పరిమితులకు లోబడి మాట్లాడాలని హితవు పలికారు. గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ అని చెప్పుకొచ్చారు. గవర్నర్​ పరిధిని భారత రాజ్యాంగం పెట్టిందని గుర్తు చేశారు. ప్రభుత్వంపై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే బాధ్యత రాహిత్యం అవుతుందన్నారు.

గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడకూడదని, గతంలో గవర్నర్లను గౌరవించామని, గవర్నర్‌లను ఎలా గౌరవించాలో ముఖ్యమంత్రికి తెలుసునని మండిపడ్డారు. గవర్నర్ చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదన్నారు. ప్రధాని, హోంమంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవసరం లేదన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్ని విషయాలు మీడియాతో మాట్లాడలేనని తమకు పరిధిలు ఉంటాయని గతంలో హుందా తనంగా వ్యవహరించారని పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్​ తన పరిధిని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడటం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు ఆరోపించారు. అప్పట్లో ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు గవర్నర్‌ను వాడుకున్నారని, ఇప్పుడు తెలంగాణపై ఆ బాణాలు పనిచేయవన్నారు. టీఆర్ఎస్ ​ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ అని చెప్పుకొచ్చారు. తమకు ప్రజాబలం పుష్కలంగా ఉన్నదని, కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా తమ పార్టీ భయపడదన్నారు.

ప్రతిపక్షాలకు మైండ్​ లేదు..

తెలంగాణ రాష్ట్రంలో దరిద్రపు ప్రతిపక్షాలు ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతల నోటికి బట్ట లేదన్నారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. సోషల్ మీడియాలో ప్రమోట్​ కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల్లోనూ బాధ్యత లేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. తాము వరి ధాన్యం మీద పోరాటం చేస్తున్నామని, రైతుల కోసం వెనక్కి తగ్గేదేలేదన్నారు. ధాన్యం ఎందుకు కొనరో ఈ బీజేపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రి నూకలు తినాలని అనడం అత్యంత దారుణమన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా మన రాష్ట్రంలో ఉన్నదన్నారు. మరోవైపు డ్రగ్స్ నివారణపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. పబ్‌లతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో తీద్దామా అంటూ సవాల్​ విసిరారు.

Tags:    

Similar News