AP News: నా వెంట్రుక కూడా పీకలేరు.. వాళ్ళు ఉండటం రాష్ట్రం చేసుకున్న కర్మ: జగన్

దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య ఎల్లో మీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండడం రాష్ట్రం చేసుకున్న కర్మ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు

Update: 2022-04-08 13:27 GMT

దిశ, రాయలసీమ : దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య ఎల్లో మీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండడం రాష్ట్రం చేసుకున్న కర్మ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విమర్శించారు. వీరు రాష్ట్ర పరువును తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. 'ఇవేవి నన్ను కదిలించలేవు.. బెదిరించలేవు.. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో ఈ స్థానానికి వచ్చా. వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు' అని వ్యాఖ్యానించారు. ఇంకా మంచి చేసే అవకాశం దేవుడివ్వాలని కోరుకుంటున్నానన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా కేంద్రంలో 2021-22 విద్యా సంవత్సరానికి రెండో విడత 'జగనన్న వసతి దీవెన' లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రానికి కొత్తగా మరో 16 మెడికల్‌ కళాశాలలు వస్తున్నాయన్నారు. అమ్మఒడి ద్వారా 44 లక్షల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతోందని వెల్లడించారు. నగదు తల్లుల ఖాతాల్లో జమ చేయడం వల్ల కళాశాలలకు వెళ్తారని, అక్కడ వసతులు ఎలా ఉన్నాయో వారే పరిశీలిస్తారని తెలిపారు. పిల్లలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి చదువు అని, నాడు- నేడుతో బడుల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. పేద పిల్లల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశామన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. 'పేదపిల్లలను చదివించేందుకు నా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకేశారు. అదే నాన్నకు కొడుకుగా జగన్ అనే నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పా. అందులో భాగంగానే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చా' అని తెలిపారు.

గుండెపోటు వచ్చి టికెట్ కొంటారు

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు 34 నెలల కాలంలో రూ.10,298 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ చెప్పారు . ఇలాంటివి కాకుండా చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చిక్కీ కవర్ మీద జగన్ ఫొటో ఉందని వార్తలు రాస్తున్నాయని విమర్శించారు. 'ఈ అసూయకు మందు లేదు.. ఈ కడుపు మంట ఎక్కువైతే కచ్చితంగా వీళ్లకు బీపీ వస్తుంది.. ఏదో రోజు గుండెపోటు వచ్చి టికెట్ కొంటారు.. అసూయను తగ్గించుకోకపోతే ఆరోగ్యానికి చేటు' అని సెటైర్లు వేశారు.

Tags:    

Similar News