తెలంగాణపైనే Amit Shah కన్ను.. ఇకనుంచి ప్రతినెలా చేసేది ఇదే!

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది.

Update: 2023-01-18 10:00 GMT

దిశ, ప్రతినిధి నిర్మల్: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత నెంబర్-2 గా పేరున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా ప్రతీ నెలకు ఒకసారి తెలంగాణకు వచ్చేలా ఆ పార్టీ వ్యూహం ఖరారు చేసింది. పార్టీ శ్రేణులు అభినవ సర్దార్ పటేల్‌గా పిలుచుకునే అమిత్ షాకు పార్టీ కేడర్‌లో.. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు యువత ఇతర వర్గాలను ఆకర్షించే వ్యూహంలో భాగంగా అమిత్ షాను ప్రతీ నెలకు ఒకసారి రాష్ట్రానికి వచ్చేలా పార్టీ నేతలు ప్రణాళికను తయారు చేసినట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు 'దిశ'కు తెలిపారు.

పర్యటన ప్రతిసారి రెండు పార్లమెంటు నియోజకవర్గాలు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అమిత్ షా పర్యటనలను ఆయుధంగా మలుచుకోవాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నెలకు ఒకసారి రాష్ట్రానికి వచ్చేలా పర్యటనలు ఖరారు చేసుకుంటున్నారు. వచ్చిన ప్రతిసారి రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగేలా ప్లాన్ చేశారు. తాజాగా ఈ నెలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న అమిత్ షా ఒకేరోజు రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈనెల 28న తొలుత మంచిర్యాలకు వస్తున్న ఆయన అక్కడ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ శ్రేణులు, బూత్ కమిటీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం అసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీమ్ పుట్టినిల్లు జోడేఘాట్ వెళ్లి అక్కడ భీమ్‌కు నివాళులర్పిస్తారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదే తరహాలో ప్రతినెల ఒకరోజు వివిధ ప్రాంతాలకు వెళ్లి ఒకేరోజు రెండు పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన చేసేలా పార్టీ అగ్ర నాయకత్వం ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News