పేపర్ల లీకేజీ వ్యవహారమంతా నడిపింది అతడే: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్‌ను కేబినెట్ భర్తరఫ్ చేయడం కాదని.. చంచల్ గూడ జైల్లో పెట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2023-03-19 08:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌ను కేబినెట్ నుండి భర్తరఫ్ చేయడం కాదని.. చంచల్ గూడ జైల్లో పెట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారిలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రేవంత్ రెడ్డి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి చెప్పడంతోనే రాజశేఖర్‌కు టీఎస్పీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. పేపర్ల లీక్ వ్యవహారం అంతా నడిపింది కేటీఆర్ పీఏ తిరుపతినే అని సంచలన ఆరోపణలు చేశారు.

కేటీఆర్ పీఏ, పేపర్ల లీకేజీ కేసులో నిందితుడు రాజశేఖర్‌ ఊర్లు పక్క పక్కనే అని.. వీరిద్దరికి సన్నిహితులైన వారికి అత్యధిక మార్కులు వచ్చాయని.. దీనిపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అసలు టీఎస్పీఎస్సీలో పని చేస్తూ పోటీ పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. గతంలో టీఎస్పీఎస్సీలో పని చేస్తూ గ్రూప్ 2 రాసిన మాధురికి ఫస్ట్ ర్యాంక్.. రజినీకాంత్ అనే వ్యక్తి 4వ ర్యాంక్ వచ్చిందని తెలిపారు. పేపర్ల లీకేజీలో కేవలం ఇద్దరికి మాత్రం సంబంధం ఉందని కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కేటీఆర్ షాడో సీఎం అయితే.. కేటీఆఆర్‌కు ఆయన పీఏ షాడో మంత్రి అని అన్నారు. 2015 నుండి ఇప్పటి వరకు జరిగిన పోటీ పరీక్షలో కొందరికి లబ్ధి జరిగిందని రేవంత్ ఆరోపించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో వందకు పైగా మార్కులు వచ్చిన అందరి వివరాలు బయటపెట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News