ప్రజాస్వామిక పాలనతోనే రాజ్యాంగం ఆశించిన లక్ష్యం: సీఎం కేసీఆర్

సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలనతోనే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.

Update: 2023-01-25 17:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలనతోనే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక దేశంగా భారత్‌లో రాజ్యాంగబద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన జనవరి 26 రోజు భారత పౌరులందరికీ పండుగ రోజని అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాతల కృషిని దేశ ప్రజలు సదా స్మరించుకుంటారని అన్నారు.

విభిన్న సామాజిక, సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని పొదిగి ఉండడమే దేశ ప్రధాన లక్షణమన్నారు. రాష్ట్రాల సమాఖ్యగా వర్థిల్లుతున్న భారత్‌లో ఫెడరల్ స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశంలో సంక్షేమం పరిఢవిల్లిన, దేశం మరింతగా ప్రగతి పథంలో పయనిస్తుందని అన్నారు. దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటూ మనకు మనం సగర్వంగా సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Similar News