పది రోజులే కీలకం.. కౌంటర్ స్ట్రాటజీలతో క్యాండిడేట్స్ దూకుడు

పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఈ పది రోజులే కీలకంగా కానున్నాయి.

Update: 2024-05-02 02:39 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఈ పది రోజులే కీలకంగా కానున్నాయి. ఎన్నికల ప్రచారానికి ముందు నుంచి ప్రచారాలలో ఉన్న అభ్యర్థులు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత వ్యూహాత్మకంగా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ పది రోజులు కీలకం కావడంతో అభ్యర్థులు తమ ప్రచార జోరును పెంచి ఎక్కడికక్కడ సభలు సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. ఇన్ని రోజుల ప్రచారాలు ఒక ఎత్తు అయితే.. ఈ పది రోజుల ప్రచారాలు మరో ఎత్తుగా సాగనున్నాయి. ఈ పది రోజులలో జరిగే ఆమ్యామ్యాలా పంపిణీ ఓటర్ల దృష్టిని ఆకట్టుకునేలా ప్రచారాలు సాగనున్నాయి.

ఎండలను సైతం లెక్కచేయకుండా....

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు భగ్గు మంటున్నాయి. ఎండలను లెక్కచేయకుండా అభ్యర్థులు ప్రచారాలు చేస్తున్నారు. తెల్లవారుజామున మార్నింగ్ వాక్, గ్రామాల సందర్శన పేరుతో ప్రచారాలలో వేగం పెంచారు. ఎక్కడికక్కడ హామీల వర్షాలు గుప్పిస్తున్నారు. ఇతర పార్టీల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులను కలిసి మంతనాలు జరిపి పార్టీలలో చేర్చుకుంటున్నారు.

వ్యక్తిగత విమర్శలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలో ఉన్న ప్రధాన పోటీ మాత్రం ఈ మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ఉంటుందన్న విషయం పాఠకులకు విధితమే. ఎన్నికల వ్యూహాలలో భాగంగా పార్టీలపరంగానే కాకుండా వ్యక్తిగత విమర్శలకు కూడా అభ్యర్థులు తెర లేపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీ ఆర్ఎస్ అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు దుమారం లేపుతున్నాయి.

నాగర్ కర్నూల్ పార్లమెంటులో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం సాగుతుండగా.. పాలమూరు పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే వరకు ఈ మాటల యుద్ధాలు, సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు వెళుతున్నాయి. మొత్తంపై ఈ పది రోజులు సాగే ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా సాగనుంది అని రాజకీయ నిపుణులు అంటున్నారు.

Similar News