సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఆ గెస్ట్ హౌస్.. తెరపైకి కొత్త ప్రపోజల్!

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఐదవ షెడ్యూలులో పేర్కొన్న ఉమ్మడి రాజధాని నిబంధన జూన్ 1వ తేదీతో ముగియనున్నది.

Update: 2024-05-17 02:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఐదవ షెడ్యూలులో పేర్కొన్న ఉమ్మడి రాజధాని నిబంధన జూన్ 1వ తేదీతో ముగియనున్నది. ఆ తర్వాత నుంచి హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా కంటిన్యూ కానున్నది. దీంతో ఇంతకాలం ఉమ్మడి రాజధాని భావనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వ పూర్తి అజమాయిషీలోకి వస్తున్నది. దీన్ని రాష్ట్ర సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చడమా? లేక ఏపీ ప్రభుత్వం రిక్వెస్టు చేస్తే దాన్ని అద్దె ప్రాతిపదికన ఇవ్వడమా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నది. నగరం నడిబొడ్డున రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న ఈ భవనాన్ని, విశాలమైన ప్రాంగణాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏ అవసరాలకు వాడుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

సీఎం క్యాంప్ ఆఫీసుగా..!

ప్రస్తుతం ముఖ్యమంత్రికి క్యాంపు కార్యాలయం లేకపోవడంతో తాత్కాలికంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసమే ఆ అవసరాలకు ఉపయోగపడుతున్నది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఎత్తయిన ప్రాంతం మీద ఉన్న స్థలంలో ఒక షెడ్డును నిర్మించి దాన్ని క్యాంప్ ఆఫీస్‌గా వాడుకోనున్నట్లు ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు. అయితే ట్రాఫిక్ రద్దీ, సెక్యూరిటీ అవసరాల దృష్ట్యా ఆ ప్లాన్ ఇంకా పూర్తి కార్యాచరణలోకి రాలేదు. ప్రస్తుతం లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వస్తుండడంతో దాన్ని సద్వినియోగం చేసుకోవడంపై అధికారుల స్థాయిలో చర్చలు మొదలయ్యాయి. సచివాలయానికి దగ్గరగా ఉండడం, సెక్యూరిటీపరంగా సురక్షితంగా ఉండడం, క్యాంప్ ఆఫీస్‌గా వాడితే ప్రజలకు సైతం ట్రాఫిక్ సమస్యలు రాకపోవడం... వీటన్నింటి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్నది.

ఫలితాల తర్వాతే క్లారిటీ

విభజన చట్టంలో ‘ఉమ్మడి రాజధాని’ అనే నిబంధన గడువు (సెక్షన్ 5) జూన్ 1వ తేదీ అర్ధరాత్రితో ముగియనున్నది. అప్పటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడవు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి సైతం ఎన్నికలు జరిగినందున ఏ పార్టీ అత్యధిక సీట్లను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో తెలియని సందిగ్ధమే అప్పటికి కంటిన్యూ అవుతుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పరిపాలన మొదలైన తర్వాత లేక్ వ్యూ గెస్ట్ హౌజ్‌ను మరికొంతకాలం ఉంచుకునేలా తెలంగాణ సర్కారుకు విజ్ఞప్తి చేస్తుందా? లేక అవసరం లేదనే స్పష్టతను ఇస్తుందా? తదితర అంశాల ఆధారంగా క్లారిటీ ఏర్పడనున్నది. తెలంగాణ ప్రభుత్వం సీఎం క్యాంపు కార్యాలయంగా వాడుకోవాలనే నిర్ణయమే తీసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ రిక్వెస్టును తిరస్కరించే అవకాశం ఉంటుందని సచివాలయ వర్గాల సమాచారం.

క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు, సౌకర్యాల కల్పన, సెక్యూరిటీ, ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు తదితరాలపై సంబంధిత విభాగాల నుంచి ఆదేశాలు జారీ అవుతాయి. లేక్‌వ్యూ గెస్ట్ హౌజ్‌ను గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఉదయం ప్రజాదర్బార్ పేరుతో సామాన్యుల గ్రీవెన్స్ పరిష్కారం కోసం, సాయంత్రం సమయాల్లో పార్టీ లీడర్లను, విజిటర్లను కలవడానికి వాడుకున్నారు. కొంతకాలం ఈ అవసరాలకు వాడగా ప్రస్తుతం ప్రజాభవన్ ఉన్న ప్రాంగణంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు కావడంతో లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ కేవలం ఉన్నతాధికారుల విడిదికి మాత్రమే పరిమితమైంది. రాష్ట్ర విభజన తర్వాత అది ఏపీ అవసరాలకు ఉపయోగపడుతున్నది.

మరికొన్ని భవనాలు సైతం..

ప్రస్తుతం హైదరాబాద్ సిటీలోని మరికొన్ని భవనాలను కూడా ఏపీ ప్రభుత్వం వేర్వేరు అవసరాలకు వాడుకుంటూ ఉన్నది. లక్డీకాపూల్‌లోని ఓ భవనాన్ని ఏపీ పోలీసు వాడుకుంటున్నది. నగరంలోని కొన్ని ప్రభుత్వ క్వార్టర్లను కూడా ఏపీ అధికారులు వాడుకుంటూ ఉన్నారు. ‘ఉమ్మడి రాజధాని’ నిబంధన కారణంగానే కొన్ని భవనాలను ఏపీకి కేటాయించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ నిబంధన గడువు తీరుతుండడంతో సిటీలోని ప్రభుత్వ భవనాలన్నీ ఏపీ అలాట్‌మెంట్ నుంచి తెలంగాణ స్వాధీనంలోకి పూర్తి స్థాయిలో రానున్నాయి. ఏయే డిపార్టుమెంటుకు చెందిన ప్రాంగణాలు, భవనాలను ఏపీ ప్రభుత్వం వాడుకుంటున్నదో ఆయా శాఖల అధికారులు లిస్టును తయారుచేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో జాబితా రెడీ అయ్యి తెలంగాణ ప్రభుత్వానికి అందనున్నది.

ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు రానున్నది. వివరాలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు లేఖ రాశారు. రాష్ట్ర విభజన వ్యవహారాలన్నింటినీ ఆయనే ప్రత్యేక బాధ్యతలతో నిర్వహిస్తున్నారు. కేవలం ఏపీ ప్రభుత్వం వాడుకుంటున్న హైదరాబాద్‌లోని భవనాలు, స్థలం వివరాలను మాత్రమే కాకుండా విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా పెండింగ్‌లో, వివాదంలో ఉన్న అంశాలను కూడా డిపార్టుమెంట్ల నుంచి స్పెషల్ సీఎస్ సేకరిస్తున్నారు. అవన్నీ వచ్చిన తర్వాత క్రోడీకరించి ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. అప్పటికి పరిష్కారమైనవి, కావాల్సినవి, కోర్టు విచారణల్లో ఉన్నవి, ఏకాభిప్రాయం వ్యక్తమైనా కార్యరూపం దాల్చకుండా ఉండిపోయినవి... ఇలా అన్ని అంశాలపై స్పష్టత వస్తుంది.

Similar News