రూ.36‌‌0‌‌ కోట్ల ల్యాండ్‌ కొల్లగొట్టేందుకు స్కెచ్.. స్పీడ్‌గా కదులుతున్న ఫైల్స్

అంతా ఎన్నికల బిజీ.. అధికారులంతా ఏర్పాట్లలోనే బిజీ.

Update: 2024-05-02 03:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అంతా ఎన్నికల బిజీ.. అధికారులంతా ఏర్పాట్లలోనే బిజీ. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రచారంలో బిజీ. ప్రతిపక్షాలది అదే దారి. ఇదే సరైన సమయం.. అనుకున్నారేమో ఏకంగా రూ.350 కోట్ల విలువైన ఫైలు వేగం పెరిగింది. కొన్ని దశాబ్ధాలుగా ఈ స్థలం గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడేమో అదే స్థలంపైన ఎన్ ఓసీ కోసం దాఖలు చేసిన ఫైల్ వేగం పుంజుకుంది. క్లియరెన్స్ ఇచ్చేందుకు అంతా రెడీ అయ్యింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి అధికారం వచ్చినా కొందరు అధికారుల వ్యవహారశైలిలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ లో మిగిలిన కాస్త ఖాళీ స్థలాలను కూడా వదలడం లేదు. వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు కొందరు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అక్రమార్కులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైరైజ్డ్ ప్రాజెక్టుల చెంతనే మిగిలిన సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్ కి భారీ స్కెచ్ వేశారు. గుట్టల బేగంపేట సర్వే నం.60/1లో 50395 చ.మీ.(60271 చ.గ. అంటే 12 ఎకరాల పైమాటే!) ఇందులో ఇప్పుడు ఖాళీగా ఉన్నది 15118 చ.మీ.(18080 చ.గ. అంటే సుమారు 3.30 ఎకరాలు). గజం విలువ రూ.2 లక్షల పైమాటే. అంటే ఈ ఖాళీ జాగ విలువ అక్షరాల 360 కోట్లకు పైగానే. ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరించేందుకు చూస్తున్నారని తెలిసింది.

జిల్లా స్థాయిలోనే ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నట్లు సమాచారం. ఆ స్థలం విస్తీర్ణం పెద్దదిగా ఉండడంతో హైరైజ్డ్ ప్రాజెక్టు చేపట్టేందుకు అనువుగా ఉన్నది. రూ.1000 కోట్లకు పైగా విలువ జేసే ప్రాజెక్టును చేపట్టేందుకు కొన్ని డెవలపర్స్ వ్యూహరచన చేస్తున్నాయి. అందుకే ఈ సీలింగ్ ల్యాండ్ ని చేజిక్కించుకునేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని తెలిసింది. ఇందులో కొందరు అధికారులు మద్దతు పలికినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరో అధికారి తాను చేయలేనని చేతులెత్తేస్తే ఒత్తిడికి గురి చేస్తున్నారని రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఫైల్ క్లియరెన్స్ ఢీల్ కుదుర్చుకున్నట్లు టాక్. ఇది క్లియర్ చేస్తే అక్రమార్కులకు రూ.350 కోట్ల విలువైన స్థలం హస్తగతమైనట్లే!

సమర్పించిన డాక్యుమెంట్లపై డౌట్

గుట్టల బేగంపేట సర్వే నం.60/1 లోని రూ.350 కోట్ల విలువైన స్థలాన్ని దక్కించుకునేందుకు సమర్పించిన డాక్యుమెంట్లపై డౌట్స్ ఉన్నాయి. కొంతకాలంగా ఈ ఫైల్ ని రిజెక్ట్ చేశారని దానికి కారణం అవన్నీ ఫేక్ అనిపించాయంటున్నారు. ఇప్పుడేమో ఆ డాక్యుమెంట్లను అధికారులు విశ్వసిస్తుండడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. వాళ్ళు సమర్పించిన డాక్యూమెంట్స్ ఒరిజినల్ అని వెరిఫై చేశారా? మరి గతంలో ఎందుకు రిజెక్ట్ చేశారు ? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సర్వే నం.31 లోని సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్ రెగ్యులరైజ్ చేసిన ఫైళ్లను కూడా పరిశీలించాలన్న డిమాండ్ వినిపిస్తున్నాది. ఆ ఫైళ్లలోనూ ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవి క్లియర్ చేసినట్లుగానే ఇది కూడా చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే ఫేక్ డాక్యుమెంట్లా? ఒరిజినల్ డాక్యుమెంట్లా? అన్న ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు.

అది సీలింగ్ ల్యాండ్

హైదరాబాద్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ స్పెషల్ ఆఫీసర్ లేఖ నం.A4/298/2010, Dated.10.02.2012 ప్రకారం F1/4277/03 ద్వారా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట సర్వే నం.60/1లో 50395 చ.మీ. స్థలం సీలింగ్ సర్ ప్లస్ గా ఉంది. అందులో 13532 చ.మీ. రెగ్యులరైజ్ చేశారు. 21744 చ.మీ. స్థలంలో నిర్మాణాలు వెలిశాయి. ఖాళీగా 15118 చ.మీ. స్థలం ఉంది. కేవలం 600 చ.మీ. విస్తీర్ణంపైన కేసు నడుస్తున్నదని రికార్డుల్లో పేర్కొన్నారు. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.

– అలాగే F/3272/6(1)/06 ప్రకారం సర్వే నం.30, 31లో 8407 చ.మీ. స్థలం ఉండేది. ఏ ప్రాతిపదికనో ఏమో గానీ మొత్తం విస్తీర్ణాన్ని రెగ్యులరైజ్ చేసేశారు.

– F1/180/82 ప్రకారం సర్వే నం.45/పి లో 15596 చ.మీ. స్థలం ఉండేది. దాంట్లో 6111 చ.మీ. స్థలాన్ని రెగ్యులరైజ్ చేశారు. 4806 చ.మీ. స్థలంలో నిర్మాణాలు ఉన్నాయి. 4679 చ.మీ. స్థలం ఖాళీగా ఉంది.

– F1/1777, 1780/76, 129/78 ప్రకారం సర్వే నం.47 లో 63028 చ.మీ. సీలింగ్ ల్యాండ్ ఉండేది. ఇందులోనూ 44120 చ.మీ. రెగ్యులరైజ్ చేశారు. 13236 చ.మీ. స్థలంలో నిర్మాణాలు వెలిశాయి. 5672 చ.మీ. స్థలం ఖాళీగా ఉన్నది.

– ఈ సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్స్ పూర్తిగా ప్రభుత్వానివే. రూ.వేల కోట్ల విలువజేసే స్థలాలను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అంతా మౌనం

గుట్టల బేగంపేట సర్వే నం.60/1లోని సీలింగ్ సర్ ప్లస్ ల్యాండ్ క్లియరెన్స్, రెగ్యులరైజేషన్, ఎన్వోసీకి రంగం సిద్ధం చేస్తున్నారన్న అంశంపై అధికారులంతా మౌనం వహిస్తున్నారు. దరఖాస్తుదారులు సమర్పించిన డాక్యుమెంట్స్ ఒరిజినల్ అని వెరిఫై చేశారా? ఒరిజినలైతే గతంలో ఎందుకు రిజెక్ట్ చేశారు? సర్వే నం.31 లోని స్థలాన్ని క్లియర్ చేసినట్లుగానే ఇది క్లియర్ చేస్తున్నారా? అన్న ప్రశ్నలకు రంగారెడ్డి జిల్లా అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. రిప్లై ఇవ్వడం లేదు. అంతా ఎన్నికల డ్యూటీలో బిజీగా ఉన్నామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోపీరాం అన్నారు.

మరో అధికారి నుంచి స్పందన లేకపోవడం గమనార్హం. గుట్టల బేగంపేటలో క్లియర్ చేసిన సీలింగ్ ల్యాండ్స్ అన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. దరఖాస్తుదారులు సమర్పించిన డాక్యుమెంట్లల్లో ఎన్ని ఫేక్? ఎన్ని ఒరిజినల్? అనేది బయటపడుతుందని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారు. అక్రమంగా చేజిక్కించుకున్న అత్యంత ఖరీదైన స్థలాలను వెనక్కి తీసుకొని వేలం వేస్తే రూ.వేల కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వస్తుందంటున్నారు.

Similar News