‘రేవంత్ రెడ్డి పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలి’

ఇచ్చిన హామీలు అమలు చేయని, రుణమాఫీ, రైతుబంధు వేయలేని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు.

Update: 2024-04-29 13:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇచ్చిన హామీలు అమలు చేయని, రుణమాఫీ, రైతుబంధు వేయలేని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాత్కాలిక ఉద్రేకాలు రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజలకు ఉపయోగపడవు అన్నారు. రాజకీయాల్లో తిట్లు, శాపనర్ధాలు ప్రజల మద్దతు కోల్పోయిన తర్వాత మాట్లాడతారని, సీఎం రేవంత్ రెడ్డి సరిగ్గా అదే చేస్తున్నారని విమర్శించారు. 60 లక్షల మంది సభ్యత్వం ఉండి 1.85 శాతం ఓట్లతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ చచ్చిన పాము ఎట్లా అవుతుంది? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పరిమితం అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అంటూనే తిట్ల దండకంతో రేవంత్ రెడ్డి ప్రజల విశ్వాసం కోల్పోతున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీలో టీమ్ వర్క్, హోం వర్క్ రెండూ లేవు అన్నారు. కేసీఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారన్నారు. పార్లమెంట్, అసెంబ్లీకి ఎక్కువ సార్లు గెలిచిన చరిత్ర కేసీఆర్‌కు ఉందన్నారు. ఎమ్మెల్యేగా తొమ్మిది సార్లు, ఎంపీగా ఐదు సార్లు గెలిచిన చరిత్ర కేసీఆర్‌కు దక్కిందన్నారు. కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి అనుభవం ఎంత? అని ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రకు మంచి ఆదరణ వస్తోందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏంటో బయటపడుతుందన్నారు. రేవంత్ రెడ్డి పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోలేక పోయారన్నారు. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు వద్దు అన్నారా?.. రైతులు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వెయ్యాలి? అన్నారు. రేవంత్ రెడ్డికి మానవీయ కోణమే లేదు అన్నారు. వెదిరె శ్రీరామ్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర జలవనరుల శాఖలో ఆయన కీలకమైన స్థానంలో ఉన్నపుడే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి వచ్చిందని అప్పుడు ఏం చేశారు అని నిలదీశారు.

Read More...

సీఎం, డీప్యూటీ సీఎం ఏం సమాధానం చెబుతారు?.. హరీష్ రావు సూటి ప్రశ్న! 

Tags:    

Similar News