రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఇలా చేయాల్సిందే.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కర్ణాటక నుంచి 20 ఎంపీలను గెలిపిస్తే, తాము తెలంగాణలో 14 ఎంపీలను గెలిపించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-04-29 13:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటక నుంచి 20 ఎంపీలను గెలిపిస్తే, తాము తెలంగాణలో 14 ఎంపీలను గెలిపించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు స్టేట్స్ ఎంపీలు రాహుల్ గాంధీ ప్రధాని కావడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కచ్చితంగా రెండు రాష్ట్రాల నుంచి ఎక్కువ ఎంపీలను గెలిపించుకోవాలన్నారు. ఇప్పుడు దేశానికి ఈ రెండు రాష్ట్రాలే నిదర్శనంగా నిలుస్తాయన్నారు. పార్టీ ఇచ్చిన గ్యారంటీలను సమర్ధవంతంగా అమలు చేశామనే పేరు కూడాఈ రెండు రాష్ట్రాలకు ఉన్నదన్నారు. సోమవారం ఆయన కర్ణాటకలోని సేడం, గుర్మిట్కల్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రద్దుకు బీజేపీ కుట్ర పన్నుతుందన్నారు. అందుకు 400 సీట్లు అంటూ హాడావిడి చేస్తుందన్నారు. ప్రజలంతా దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నదన్నారు. గుజరాత్ మోడీకి అండగా ఉన్నట్లే, కర్ణాటక ఖర్గేకు అండగా ఉండాలన్నారు. లోక్ సభ ఎన్నికలు కర్ణాటక వర్సెస్ గుజరాత్ తరహాలో జరగబోతున్నాయన్నారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎంతో పోరాటం చేస్తున్నారన్నారు. ఈ పోరాటంలో కర్ణాటక నుంచి 25 ఎంపీలను గెలిపించి మోదీని గద్దె దించడానికి ప్రజలకు సహకరించాలన్నారు. కర్ణాటక రాష్ట్రానికి కరువు వస్తే మోదీ ఎలాంటి సహాయం చేయలేదన్నారు. మోదీ కర్ణాటకకు ఇచ్చిందేమీ లేదని, ఖాళీ చెంబు ఇచ్చి మోసం చేశాడన్నారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోందన్నారు. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారన్నారు. ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే కొనసాగారన్నారు.1972లో మొదటిసారిగా ఎన్నికైన ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. ఇక్కడి స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఐదు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం కర్ణాటక అని కొనియాడారు. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామన్నారు.

కానీ పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారన్నారు. 40 కోట్ల ఖాతాలు తెరిపించిన మోదీ, ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదన్నారు. గతంలో కర్ణాటక నుంచి 26 ఎంపీలను ఇస్తే, మోదీ కర్ణాటకకు ఇచ్చింది కేవలం ఒకటే కేబినెట్ పదవి అని గుర్తు చేశారు. కరువు వస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నరేంద్ర మోదీ ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. లక్ష మెజారిటీతో ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపిస్తే, దేశ వ్యాప్తంగా కీ రోల్ పోషించవచ్చన్నారు.

నాకు నోటీసులొచ్చాయి

బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని, తనతో పాటు సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు గాంధీ భవన్ నేతలకూ ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పవర్‌లో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. థర్డ్ టైమ్ పవర్ కోసం కాంగ్రెస్‌ను డ్యామేజ్ చేయాలని కుట్రలకు పాల్పడుతుందన్నారు. అందుకే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. ఇటీవల కర్ణాటకలో, తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు దేశంలో రావాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు దేశానికి మార్గదర్శకంగా ఉండాలని, అందుకే ప్రజలంతా కాంగ్రెస్ వైపు నిలబడాలని కోరారు.

Read More...

షర్మిల, సీఎం రేవంత్ రెడ్డి పై జగన్ సంచలన వ్యాఖ్యలు 


Tags:    

Similar News