రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్,బీఆర్ఎస్ విష ప్రచారం : రాజా సింగ్

రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు డ్రామా రాజకీయాలు చేస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ ఆరోపించారు.

Update: 2024-05-05 16:17 GMT

దిశ, తాండూరు : రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు డ్రామా రాజకీయాలు చేస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ ఆరోపించారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తాండూరు పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో రాజాసింగ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్ షో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి రాజసింగ్ మాట్లాడారు..

మరోసారి దేశంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతుందని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి కొలువు తీరబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్న నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని రాజాసింగ్ చెప్పారు. మోడీ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, శత్రు దేశాలు మాత్రం భయం గుప్పిట్లో బతుకుతున్నాయని చెప్పారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శత్రుదేశాలు ఎంతో ఇబ్బంది పెట్టాయని, కానీ నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక పరిస్థితులు మారాయని, మన దేశం వైపు చూడాలంటేనే పాకిస్తాన్, చైనా వంటి దేశాలు వణికిపోతున్నాయని రాజాసింగ్ అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుండి దేశంలో ఎలాంటి అవినీతి స్కామ్స్ లేవని, కాంగ్రెస్ అంటేనే స్కాం లు అని ఎద్దేవా చేశారు. మే 13 మే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని రెండు లక్షల భారీ మెజార్టీతో గెలిపించి మోడీకి బహుమతి ఇవ్వాలని ఆయన కోరారు.

దొంగ వీడియోలతో బీజేపీని దెబ్బతీసే కుట్ర

మోసపూరితమైన ఆరు గ్యారెంటీల కాంగ్రెస్‌ బండారాన్ని ప్రజలు గమనించారని, ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల వద్దకు వెళ్తున్న నాయకులను నిలదీస్తున్నారని అన్నారు. ఆరు గ్యారంటీలపై అడిగితే తాను మాట్లాడలేనని సీఎం రేవంత్‌ రెడ్డి చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా కాంగ్రెస్‌ నాయకులు కుట్రలు చేస్తున్నారని, ఓడిపోతామని భయంతో కాంగ్రెస్‌ ఈ విధంగా నీచానికి దిగజారిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని తెలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం ఏంటని స్థానిక ప్రజలే బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు. రంజిత్ రెడ్డి ఎంపీగా పనిచేసిన సమయంలో ప్రజా సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని, రైతులు, నిరుద్యోగులు అనేక ఇబ్బందులతో అల్లాడినా స్పందించలేదని విమర్శించారు.

అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..

రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా కేవలం కొడంగల్ ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అధిక నిధులను, వికారాబాద్ జిల్లాకు చెందాల్సిన నది జలాలను కొడంగల్ కు తీసుకుపోయే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడాన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తప్పుపట్టారు. ఆరు గ్యారెంటిల పేరు చెప్పి ప్రజలను మోసం చేసిన రేవంత్ మరోసారి అలాంటి ప్రయత్నమే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేయబోతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలందరూ రేవంత్ రెడ్డి కుట్రలను పసిగట్టి సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు.

కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తూ బిజెపిపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని అన్నారు.

దేశంలో ముస్లిం మైనారిటీలను ఆదుకున్న ఘనత నరేంద్ర మోడీకే దక్కిందన్నారు.నరేంద్ర మోడీ పిలుపునిచ్చినట్టుగా 400 ఎంపీ స్థానాలు బిజెపి గెలుచుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలోనూ 14స్థానాల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించబోతున్నామి అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తన వెంట నాలుగు లక్షల ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయని సంబరపడుతున్నాడని ఆయనకు యువకులంతా తగిన బుద్ధి చెప్పాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్, బీజేపీ సీనియర్ నేతలు,కార్యకర్తలు,బిజెపి అభిమానులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News