పోలింగ్ కి 48 గంటల ముందు బాధ్యతగా విధులు నిర్వహించాలి : జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్

భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి పోలింగ్ రోజు ముందు 48 గంటల నిశ్శబ్ద (సైలెన్స్ పీరియడ్ ) కాలం అత్యంత కీలకమని, అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు.

Update: 2024-05-08 11:07 GMT

దిశ, కామారెడ్డి : భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి పోలింగ్ రోజు ముందు 48 గంటల నిశ్శబ్ద (సైలెన్స్ పీరియడ్ ) కాలం అత్యంత కీలకమని, అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోసిజర్ లో పేర్కొన్న విధంగా పోలింగ్ కు 72 గంటలు, 48 గంటల ముందు తప్పక పాటించవలసిన నిబంధనలను వివరిస్తూ సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, ఆదాయ పన్ను అధికారులు, ఎఫ్ఎస్టీ, ఎస్ ఎస్టీ టీములు, వ్యయ నియంత్ర అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నెల 13న సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా, అంతకు ముందు 48 గంటల నుంచి ఎన్నిక ముగిసే వరకు ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని, ఐదుగురికి మించి ఒకే చోట గుమికూడరాదన్నారు.

     ప్రచార సమయం ముగిసిన వెంటనే ఇతర నియోజక వర్గాలవారు వెళ్లిపోవాల్సి ఉంటుందన్నారు. కల్యాణ మండపాలు, మ్యారేజ్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జిలు, అతిథి గృహాలలో ఇతర నియోజక వర్గ ప్రాంతాల వారిని గుర్తించి పంపించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రాష్ట్ర, జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను మరింత పటిష్టం చేసి ఇతర నియోజక వర్గ వాహనాలు ప్రవేశించకుండా డబ్బు, మద్యం, కానుకలు వంటివి అక్రమ రవాణా జరగకుండా ముమ్మర తనిఖీ చేయాలని, 50 వేలకు పైగా నగదు, 10 వేలకు పైగా వస్తువుల రవాణాను గుర్తించి స్వాధీనపరుచుకొని కేసులు నమోదు చేయాలని బృందాలకు సూచించారు. ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతులతో ప్రలోభపెట్టడం, ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు వాహనాల్లో తరలించడం నేరమని, అటువంటి సంఘటనలపై తహసీల్ధార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఈ నెల 11, 12 తేదీలలో రాత్రి వేళలో ప్రత్యేక నిఘా పెట్టి సి-విజిల్, 1950 ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే పరిష్కరించాలన్నారు. పోలింగ్ స్టేషన్ల సమీప ప్రాంతాల్లో ఎటువంటి ప్రచారం చేయరాదని సూచించారు. ఓటు గోప్యత దృష్ట్యా మీడియా ఫొటోలు తీయరాదని కలెక్టర్ కోరారు. 

Similar News