రానున్న 5 రోజుల్లో 95 శాతం ధాన్యం కొనుగోలు చేస్తాం

రాబోయే ఐదు రోజుల్లో 95 శాతం పంట కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పారు.

Update: 2024-05-19 10:56 GMT

దిశ, కామారెడ్డి : రాబోయే ఐదు రోజుల్లో 95 శాతం పంట కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పారు. ఆదివారం రామారెడ్డి మండలం పోసానిపేట, గిద్దలో కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తో కలిసి పరిశీలించారు. అక్కడ ధాన్యంలో తేమను పరిశీలించి రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 350 కొనుగోలు కేంద్రాల ద్వారా 46,613 మంది రైతుల నుండి 576 కోట్ల విలువ గల 2.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 504 కోట్లు జమ చేశామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 200 కేంద్రాలలో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. మరో రెండు రోజుల్లో ముప్పై కేంద్రాలలో ధాన్యాన్ని , ఆ మరో రెండు రోజులలో 40 కేంద్రాలలో ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు.

    ఈ నెలాఖరునాటికి లక్ష్యం మేరకు రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను పూర్తిగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ చెప్పారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం యావత్తు ధాన్యం సేకరణ ప్రక్రియలో నిమగ్నమై ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, సహకార శాఖ, పౌరసరఫరాల అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారని అన్నారు. ప్రతిరోజూ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్ల తో సమీక్షిస్తూ ధాన్యాన్ని కేంద్రాల నుంచి మిల్లులకు తరలిస్తున్నామని, మిల్లర్లు కూడా ఎంతో సహకరిస్తున్నారని కలెక్టర్ అన్నారు. కొన్ని మిల్లర్లు డిఫాల్ట్ గా ఉన్నాయని, ధాన్యం దించుకోవడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని , జిల్లా యంత్రాంగానికి పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు. మిల్లుల సామర్థ్యం మేరకు ట్యాగ్ చేసిన మిల్లులకు ధాన్యం తరలిస్తూ త్వరగా అన్లోడ్ అయ్యే విధంగా అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని, రైతులు అధైర్యపడవద్దని కలెక్టర్ అన్నారు. వాతావరణం పొడిగా ఉందని నాలుగైదు రోజులు

    వర్షాలు కురిసే అవకాశాలు లేవని రైతులు ధైర్యంగా ఉండాలని అన్నారు. ఒకవేళ వర్షాలు పడ్డా తడిచిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తామని భరోసానిచ్చారు. రైతులు కూడా అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని సూచించారు. తహసీల్దార్లు, అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో త్వరితగతిన ధాన్యం తూకం వేసి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలిస్తారని, రైతులకు ఇబ్బంది లేకుండా వసతులు కల్పిస్తారని కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, తహసీల్దార్, ఉప తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. 

Similar News