బట్టాపూర్ అక్రమ క్వారీలో 400 కోట్ల రూపాయల కుంభకోణం..

నిజామాబాద్ జిల్లా బట్టాపూర్ లో అనుమతులు లేకుండా జరుగుతున్న క్వారీ తవ్వకాలలో 400 కోట్ల కుంభకోణం దాగుందని దానిలో రాష్ర్ట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని బీజేపీ బాల్కోండ ఇంచార్జీ ఎలేటి మల్లిఖార్జున్ రెడ్డి ఆరోపించారు.

Update: 2023-05-26 17:27 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బట్టాపూర్ లో అనుమతులు లేకుండా జరుగుతున్న క్వారీ తవ్వకాలలో 400 కోట్ల కుంభకోణం దాగుందని దానిలో రాష్ర్ట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని బీజేపీ బాల్కోండ ఇంచార్జీ ఎలేటి మల్లిఖార్జున్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలోని అక్రమ క్వారీ అక్రమాల పై బాల్కొండ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ గత వారం రోజుల కింద ఇదే అక్రమ క్వారీలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని వెంటనే ఇటీఎస్ సర్వే చేయించి నిజాలు నిగ్గు తెల్చాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కి ఫిర్యాదు చేశారన్నారు. బట్టాపూర్ అక్రమ క్వారీ గురించి సమాచార హక్కు చట్టం ద్వారా లభించిన సమాచారం మేరకు అక్రమ క్వారీ కి 9280 క్యూబిక్ మీటర్ల అనుమతి మాత్రమే ఉందని, క్వారీ నడపడానికి పర్యావరణ అనుమతి కూడా లేదన్నారు.

24-09-2022 నాడు గనుల శాఖ డైరెక్టర్ జనరల్ అప్పటి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కి ఈ బట్టాపూర్ క్వారీ లో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. తగు చర్యలు తీసుకొని వెంటనే క్వారీని పరిశీలించమని ఒక లేఖ రాశామని తెలిపారు. దాంతో సోమేశ్ కుమార్ వెంటనే నిజామాబాద్ గనుల శాఖ అధికారికి ఆ బట్టాపూర్ క్వారీని ముఖ్యమైన అంశంగా పరిగణలోకి తీసుకొని వెంటనే పరిశీలించి వివరాలు పంపించమని ఆదేశాలు జారీ చేశారు. గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ క్వారీని పరిశీలించిన తర్వాత చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కి సమర్పించిన నివేదికలో క్వారీ లీజుదారున్ని ప్రశ్నిస్తే ఇచ్చిన సమాచారం మేరకు ఈ క్వారీ లో 90 శాతం కంకర ని వినయోగించామని, ఆ కంకరను అర్ అండ్ బీ శాఖకు సంబందించిన 34 పనులకు వినియోగించామన్నారు. అంతేకాకుండా 1 ఏప్రిల్ 2021 నుండి 30 నవంబర్ 2021 వరకు 1,15,50,679/- రూపాయలు ప్రభుత్వానికి పన్ను చెల్లించామని తెలిపారన్నారు.

ఒక క్యూబిక్ మీటర్ కి 75/- రూపాయల చొప్పున ప్రభుత్వానికి పన్నుచెల్లించాలి, వాళ్లకు ఉన్న అనుమతి 9280 క్యూబిక్ మీటర్లు మాత్రమే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు చెల్లించిన మొత్తాన్ని అంచనా వేస్తే అనుమతికి మించి 1,54,000 క్యూబిక్ మీటర్ల వరకు అక్రమంగా తవ్వకం చేశారని మండిపడ్డారు. లీజుదారులు ఈ క్వారీని దాదాపు 8 సంవత్సరాల నుండి నడుపుతున్నారని ఆ విధంగా చూస్తే సుమారు ఇప్పటివరకు 20 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు అనుమతికి మించి అక్రమంగా తవ్వకం చేశారని విమర్శించారు. ఈ 20 లక్షల క్యూబిక్ మీటర్ల అక్రమంగా తవ్విన కంకరకు ఒక క్యూబిక్ మీటర్ కంకరను 2000/- రూపాయల చొప్పున మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖకు 400 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని అన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని మండిపడ్డారు. ఈ అక్రమ క్వారీ లీజుదారులు కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి దగ్గరి బంధువులే అని విమర్శించారు. ఇంత పెద్ద కుంభకోణం ఈ ఒక్క గ్రామంలోనే జరిగితే రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఇంకెన్ని చోట్ల ఇలాంటి దురాగతాలకు పాల్పడ్డారో అని ప్రశ్నించారు.

ప్రతిసారి రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ కాళ్ళు మొక్కి అభివృద్ధి పనులు తీసుకొచ్చిన అని నియోజకవర్గ ప్రజలను మాయచేస్తున్నాడని అభివృద్ధి కోసం కాళ్ళుమోక్కడం కాదు మంత్రి చేసిన అవినీతి, అక్రమాల చిట్టా మొత్తం కెసిఆర్ దగ్గర ఉందని కాళ్ళు మొక్కుతున్నాడని విమర్శించారు. ఎవరికైనా తల్లితండ్రుల పోలికలు వస్తాయి కానీ మన మంత్రి కి మాత్రం బాపు అని చెప్పుకొని తిరిగే కెసిఆర్ పోలికలు వచ్చాయన్నారు అందుకే ఎక్కడ చుసిన అభివృద్ధి పేరుతో అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ని సూటిగా ప్రశ్నిస్తూ 2014 లో ని ఆస్తులెన్ని ఇప్పుడు నీ ఆస్తులెన్ని అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ అక్రమ క్వారీలో తన ప్రమేయం ఏమైనా ఉందా లేదా అనేది ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలన్నారు లేని పక్షంలో తక్షణమే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీస్కొని బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ, డిచ్ పల్లి ఎంపీపీ గద్దే భూమన్న, బీజేపీ నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి న్యాలం రాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, బోధన్ నియోజకవర్గ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News