తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన హామీలు అమలు చేస్తాం : కోమటిరెడ్డి

తల తాకట్టు పెట్టైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-04-28 16:38 GMT

దిశ, భువనగిరి రూరల్: తల తాకట్టు పెట్టైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని బీబీనగర్ రోడ్ షోలో ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.... చామల కిరణ్ కుమార్ రెడ్డికి మునుగోడు కంటే భువనగిరి నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజారిటీ వస్తే… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడుపులో తలకాయ పెట్టైనా భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ కు 100 కోట్లు తెచ్చే బాధ్యత నాదే అన్నారు.

తల తాకట్టు పెట్టైనా తెలంగాణ ప్రజల కోసం ఇచ్చిన హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకుంటామన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ మాఫీ చేస్తామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది పేదల కోసం, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసంమని అన్నారు. మన నీళ్లు, నిధులు,నియామకాలు మన పిల్లలకే చెందాలి కానీ గత పది ఏళ్ళు కేసీఆర్ కుటుంబం అనుభవించిందని ఆరోపించారు. ఇక ఇప్పుడు కేసీఆర్, గీసిఆర్ జాంతానై మరో 20ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రజల అండతో అధికారంలో ఉంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ నేరం రుజువైతే బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలతో పాటు బిఆర్ఎస్ పార్టీ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.

పది యేండ్ల పాటు పేరుకపోయిన కేసీఆర్ పాపాల పుట్టను విప్పుతున్నామన్నారు.

త్వరలోనే బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ ఫ్యామిలీ జైలుకెళ్లడం ఖాయమన్నారు. 10ఏండ్లు అధికార గర్వం తో, అబద్దాలతో, మాయమాటలతో తెలంగాణ ప్రజలను దోచుకున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇలా ఏ ఒక్కటి ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ప్రాజెక్టుల పేరుతో కమిషన్ లు దండుకొని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి రాష్ట్రా సంపదను దోచుకున్న గజదొంగే కేసీఆర్ అని అన్నారు.

శ్రీశైల సొరంగ మార్గం , డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఏ ఒక్కటి పూర్తి చేయలేదు విమర్శించారు. గతంలో నేను ఎంపీగా బునాదిగానే కాలువ కోసం సొంత నిధులు ఖర్చు పెట్టానని గుర్తు చేశారు. యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మాకు తోడుగా ఉండి కేంద్రంలో రావలసిన నిధులను తీసుకొచ్చి భువనగిరి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతాడు అని తెలిపారు.

భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ....కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే 500 కోట్లు ఖర్చుపెట్టి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేవారన్నారు. కాళేశ్వరం కమిషన్ల మైకంల ఉండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. మోడీ గుజరాత్ రాష్ట్రాన్ని మాత్రమే అభివృద్ధి చేశాడు. దేశంలో మిగతా రాష్ట్రాలను పట్టించుకోలేదు అని అన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగానైతే గ్రామాల్లో ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన మీరు ఇప్పుడు కేంద్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని కోరారు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి, గెలిపించండి అని కోరారు. భువనగిరి పార్లమెంట్ ను అభివృద్ధి చేస్తానన్నారు.

ధర్మారెడ్డి పల్లి, పిల్లాయిపల్లి, బస్వాపూర్, ఆసిఫ్ నగర్, మూసీ నది ప్రక్షాళనకు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి బ్రదర్ సహకారంతో నియోజకవర్గని అన్ని విధాలా అభివృద్ధికి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, సీనియర్ నాయకులు, రామాంజనేయ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సత్తిరెడ్డి, ముఖ్య నాయకులు శ్యామ్, నరేందర్ రెడ్డి, వేణు గౌడ్ నియోజకవర్గం కో - ఆర్డినేటర్లు ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Similar News