హామీలు నెరవేర్చలేకనే రేవంత్ రెడ్డి రిజర్వేషన్‌ల అంశాన్ని తెరపైకి : ఈటల

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-05-03 13:09 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు అంశాన్ని తెరపైకి తెచ్చారని మల్కాజ్ గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని సీఎం అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్దారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని డ్రీమ్ ల్యాండ్ గార్డెన్స్ లో ఈటల మీడీయాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5వ తేదీన సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. ఈ సభలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజక వర్గం లోని ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి, మేడ్చల్, కంటోన్మెంట్, కూకట్ పల్లి,కుత్బుల్లాపూర్ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నట్లు తెలిపారు.

భారతీయ జనతా పార్టీ మిగిలిన పార్టీలన్నింటి కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిందని, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోందన్నారు. అమిత్‌షా తెలంగాణ ప్రచారానికి వచ్చినప్పుడు 12 సీట్లలో గెలుస్తున్నామని సర్వేల ద్వారా తెలిసిందని చెప్పారు. ప్రధాని మోదీ మల్కాజ్‌గిరిలో రోడ్‌షో ర్యాలీని చూసి మంత్రముగ్దులయియ్యారని, మల్కాజ్‌గిరి ప్రజల ఆదరాభిమానాలకు ఎంతో సంతోషించారని తెలిపారు. మేమందరం గత రెండు నెలలుగా ఎన్నికల నిర్వహిస్తున్నాము. అబ్‌కీ బార్ చార్ సౌ పార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రజలలో నుండి నినాదాలు వస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇతర పార్టీ నాయకులకు వెలకడుతూ లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోంది. అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఈటల విమర్శించారు.

రిజర్వేషన్లు కాంగ్రెస్ తో రాలేదు..

రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీతో రాలేదని ఈటల పేర్కొన్నారు. స్వాతంత్య్రం రాకముందే సాహు మహరాజ్ కల్పించారని, సైమన్ కమిషన్ 1927 లో పేదలకు, అణచివేతకు గురైన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని రిపోర్టు తయారు చేసిందని వివరించారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ఈ రిపోర్టును పట్టించుకోలేదున్నారు.కానీ అంబేద్కర్‌ మాత్రం లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో పాల్గొని, ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడారని, రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ గారే రిజర్వేషన్ల అంశాన్ని పొందుపరిచినట్లు తెలిపారు.అప్పట్లో వీపీ సింగ్ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్‌లో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ గాంధీ ఈ రోజుల్లో కూడా ఎందుకు కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రశ్నించారని రాజేందర్ నిలదీశారు.గిరిజన మంత్రిత్వ శాఖను ప్రవేశ పెట్టిందే వాజపేయి అని, గుజరాత్‌లో 30 ఏళ్లుగా పరిపాలిస్తున్న బీజేపీ ఏనాడూ రిజర్వేషన్లు రద్దు చేయలేదని హితువు పలికారు..బీసీలకు మొట్టమొదటిగా చట్టబద్ధత కల్పించింది నరేంద్రమోదీ యేనని,. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు మద్దతుగా లేదన్నారు.వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది వెనుకబడిన తరగతుల వారికి మంత్రిత్వ శాఖలు ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.ప్రధాని మోదీ మంత్రివర్గంలో 27 మంది ఓబీసీ, 12 ఎస్సీ, 8 మంది ట్రైబల్ మంత్రులు ఉన్నారని అన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని దళితులకు ఇచ్చారు. ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్ము ను రాష్ట్రపతిని చేశారు. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మైనారిటీ కి చెందిన అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతి పదవి ఇచ్చి గౌరవించారని తెలిపారు. ఈ చరిత్ర అంతా మరిచిపోయి కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.

అంతే కాదు అగ్రవర్ణాల పేదలకు కూడా రాజ్యాంగ సవరణ చేసి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ప్రవేశపెట్టిన ఘనత నరేంద్రమోదీదేనన్నారు.దేశంలో అసమానతలు పోవాలని, అన్ని కులాలు, వర్గాల వారికి సముచిత న్యాయం జరగాలని సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ అనే నినాదాన్ని ప్రోత్సహిస్తున్నారు నరేంద్రమోదీ. 1977 తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు తప్ప పటిష్టమైన ప్రభుత్వం లేదన్నారు.బీజేపీపై గుడ్డి ద్వేషంతో మాట్లాడుతున్న మాటలే కానీ, కాంగ్రెస్ చెప్పే మాటలలో ఏమాత్రం నిజం లేదు. బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదని ఈటల స్పష్టంచేశారు. 106 రాజ్యాంగ సవరణలు చేసింది కాంగ్రెస్ పార్టీనే. కాలానుగుణంగా ప్రజల అవసరాలను బట్టి సవరణలు చేయడం తప్ప మార్చడం ఎంతమాత్రం కుదరదని దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి తెలియకపోవడం విచిత్రంగా ఉంది.ప్రజలకిచ్చిన వాగ్దానాలు రేవంత్ రెడ్డి అమలుచేస్తారు అని భావించాం కానీ, ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లయ్యిందని బాధ పడుతున్నారు.అమిత్ షా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, నర్సింగ్ రావు, మల్లిఖార్జున్, వైఎల్ శ్రీనివాస్, మల్కా యశస్వి తదితరులు పాల్గొన్నారు.

Similar News