కబ్జా కోరల్లో పెద్ద చెరువు..?

ప్రభుత్వ భూములపై అక్రమణదారుల కన్ను పడింది.

Update: 2024-05-17 13:43 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రభుత్వ భూములపై అక్రమణదారుల కన్ను పడింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జా పర్వం కొనసాగుతోంది. పట్టించుకునే వారు లేక చెరువు, దేవాలయ భూములను సైతం వదలకుండా వాటినే ఆనుకొనే హద్దు రాళ్లు పాతి ఆక్రమిస్తున్నారు.శామీర్ పేట మండల పరిధిలోని తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో సర్కారు స్థలాలు అన్యాక్రాంతమవుతున్న ..అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సర్కారీ స్థలాల్లో రియల్ ఎస్టేట్..

తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్ టీఎల్ సరిహద్దుల్లో సర్వే నెంబర్ 320,322, 324 లో సుమారు రెండు ఎకరాల స్థలం ఉంది.ఎఫ్ టీఎల్ అనుకోని ఇదే సర్వే నెంబర్ లో నోముల క్రిష్ణారెడ్డి, నోముల మధుసూదన్ రెడ్డిలు అనే ఇద్దరు అన్నదమ్ములకు రెండు ఎకరాల పొలం ఉంది. అయితే వీరు తమ రెండెకరాల స్వంత స్థలంతో పాటు పెద్ద చెరువు కి సంబంధించిన ఎఫ్ టిఎల్ స్థలాన్ని కలుపుకోని మొత్తం నాలుగు ఎకరాల్లో దర్జాగా లే అవుట్ వేశారు. పాత లే అవుట్ పేరిట అమాయక జనానికి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఈ అక్రమ లేవుట్ పై ఫిర్యాదులు రావడంతో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు సంయుక్తంగా ఇటివల సర్వే నిర్వహించారు. లే అవుట్ వేసిన స్థలంలో ఎప్ టీఎల్ స్థలం ఉందని అధికారులు నిర్దారించి హద్దురాళ్లను పాతారు. అయితే ఎఫ్ టీఎల్ అక్రమించిన నోముల బ్రదర్స్ పై ఏలాంటి కేసులు నమోదు చేయకపోవడం.. చట్టరీత్యా చర్య తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

దేవాలయ భూములను సైతం..

తూంకుంట మున్సిపాలిటీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై నోముల బ్రదర్స్ కన్నేశారు. సర్వే నెంబర్ 325 లోని ఒక ఎకరం 16 గుంటల స్థలం తో పాటు 326 సర్వే నెంబర్ లో 23 గుంటలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములున్నాయి. అయితే ఈ ఎండోమెంట్ భూముల పక్కనే సర్వే నంబర్ 324 లో నోముల బ్రదర్స్ కు కొంత స్థలం ఉంది. దీన్నే అదునుగా తీసుకున్న నోముల క్రిష్ణారెడ్డి, నోముల మధుసూదన్ రెడ్డిలు దేవాలయ భూములను ఆక్రమించుకుని ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటురన్నా.. ఆరోపణలు ఉన్నాయి. అయితే దేవాలయ స్థలాలను ఒకవైపు అక్రమించుకుంటుంటే ఎండో మెంట్ విభాగం రక్షించ కపోగా, మున్సిపల్ అధికారులు ఆలయ భూముల్లో భవనాలకు అనుమతులు ఇవ్వడం కొసమెరుపు.. తూంకుంట మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ భూ అక్రమ,రియల్ ఎస్టేట్ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.

భూ అక్రమ దందా వెనుక నోముల హస్తం.. : ఎద్దు నగేష్, తూంకుంట మాజీ సర్పంచ్

పెద్ద చెరువు ఎఫ్ టీఎల్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుడి మాన్యాల ను స్థానికులైన నోముల క్రిష్ణారెడ్డి, నోముల మధుసూదన్ రెడ్డిలు కబ్జా చేశారు. అందులో అక్రమంగా లేవుట్ వేసి, ప్లాట్లుగా అమాయక జనానికి విక్రయిస్తూ రూ. కోట్లు కొల్లగొడుతున్నాడు. అక్రమ లేవుట్ లో వేసిన రోడ్లను ,నిర్మించిన భవనాలను గతంలో మున్సిపల్ అధికారులు కూల్చేశారు. తాజాగా దేవుడి మాన్యంలో నిర్మిస్తున్న భవనాలకు మున్సిపల్ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎఫ్ టిఎల్, దేవాలయ భూములను కాపాడాలి..

Similar News