గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో మోదీ ఉండాలి

గల్లీలో ఎవరున్నా, ఢిల్లీలో మోదీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.

Update: 2024-05-04 07:09 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో/ పేట్ బషీరాబాద్: గల్లీలో ఎవరున్నా, ఢిల్లీలో మోదీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. దేశంలో టెర్రరిస్టులకు, మిలిటెంట్లకు ప్రధాని సింహస్వప్నంగా మారారని, మన సైనికులకు అండగా నిలబడ్డారని తెలిపారు.. మోడీ ప్రధాని అయ్యాక, దేశవిదేశాలలో భారత కీర్తి ప్రతిష్టలు ఎంతగానో పెరిగాయన్నారు.రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో మన దేశ విద్యార్థులు చిక్కుకుంటే, యుద్ధాన్ని ఆపించి మరీ వారిని క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన ఘనత మోడీకి దక్కిందన్నారు. మోదీకి ఎందుకు ఓటు వేయాలో అభినందన్ తల్లిని అడగండని ఈటల సవాల్ విసిరారు.

మన నేవీ ఉద్యోగులకు పరాయి దేశంలో ఉరిశిక్ష పడితే ఆ దేశాల అధ్యక్షులతో మాట్లాడి, దానిని మన ప్రధాని రద్దు చేయించిన విషయాన్ని ఈటల గుర్తు చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్‌లోని వెంకటేశ్వర్ల కాలనీ లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దేశంలో ఒకే చట్టం ఉండాలని ఎంతో కృషి చేశారని, కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేసి, దానిని ప్రత్యేక రాష్ట్రంగా,కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారని వ్యాఖ్యనించారు.దేశంలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఆసుపత్రులు మోడీ ప్రధాని కాకముందు 3 మాత్రమే ఉండేవని, కానీ ఇప్పుడు 17కు చేరాయని వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి, అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉంటే మన దేశం మాత్రం కరోనాను తట్టుకుని, 11 వ స్థానం నుండి 5 వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు ధైర్యం చెప్పి, కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇన్నికోట్ల మంది ప్రజలకు అందించారు. ప్రజలు ఆకలితో ఉండకూడదని ప్రతి పేదవారికి మనిషికి 5 కిలోల చొప్పున మంచి సన్నబియ్యాన్ని రేషన్ ద్వారా 4 సంవత్సరాలుగా అందిస్తున్నారు. మరో ఐదేళ్ల పాటు కూడా ఇలాగే ఇస్తామని ప్రకటించారని తెలిపారు. నాయకుడంటే కేవలం పాలించేవాడు కాదు. ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సంస్కృతిని నిలబెట్టేవాడని. అందుకే హిందువులు శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరాన్ని ప్రపంచ స్థాయిలో ప్రధాని మోదీ గొప్పగా కట్టించారని తెలిపారు.

తెలంగాణ హామీ అమలేమైందీ...?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ మాత్రం నెరవేర్చ లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తప్పును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నెట్టడానికి ప్రయత్నించారని, కేసీఆర్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని, ప్రజలకు పథకాలు ఇవ్వడానికి ఏమీ లేదని పరోక్షంగా రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్రానికి రాకపోతే కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని దుయ్యబట్టారు.దేశాభివృద్ధి జరగాలన్నా, ప్రజలు ఉగ్రవాదుల భయం లేకుండా హాయిగా ఉండాలన్నా, ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టాలన్నా, దేశంలో మౌలిక సదుపాయాలు మెరుగు పడాలన్నా అది కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని స్పష్టంచేశారు.

తాను ఈ మల్కాజ్‌గిరి నియోజక వర్గానినకి ఎంపీనైతే, ఇక్కడ సమస్యలపై నేరుగా ప్రధాని మోదీతో చర్చించి వేగంగా పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మల్కాజ్‌గిరికి ఐటీ కారిడార్, రైల్వేస్టేషన్లు, ఇక్కడి వారికి ఉద్యోగావకాశాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.కొంపల్లి వైపు మెట్రో రైలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నామని, మల్కాజిగిరిలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా తాను పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఇస్తున్నాను. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఈ నియోజక వర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేరని తెలిపారు.. గతంలో ఇక్కడ ఈ పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను మీరు చూశారు. మొదటిసారి ఈ నియోజక వర్గంలో బీజేపీకి అవకాశం ఇవ్వండని ఈటల అభ్యర్థించారు.ముందుగా ఈటల రాజేందర్ జీడిమెట్లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఈటలకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లారెడ్డి, భరత్ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News