10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన అవినీతిమయం

తెలంగాణలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాల చిట్టా మూట కట్టిందని ... తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ ఆడాల్సిన మా చెల్లెలు కవిత ఢిల్లీలో సారా దందా నిర్వహించి కోట్లు గడించి తీహార్ జైలు పాలైందని... త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్, బావ బామ్మర్దులైన కేటీఆర్, హరీష్ రావులు జైలుకు పోవడం ఖాయమని మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.

Update: 2024-05-04 09:00 GMT

దిశ, మనోహరాబాద్ : తెలంగాణలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాల చిట్టా మూట కట్టిందని ... తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ ఆడాల్సిన మా చెల్లెలు కవిత ఢిల్లీలో సారా దందా నిర్వహించి కోట్లు గడించి తీహార్ జైలు పాలైందని... త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్, బావ బామ్మర్దులైన కేటీఆర్, హరీష్ రావులు జైలుకు పోవడం ఖాయమని మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మండల కేంద్రమైన మనోహరాబాద్, మండలంలోని కాలకల్, కూచారం గ్రామాలలో రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో రఘునందన్ రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ, 4 వేల ఆసరా పింఛన్లు, ప్రతి మహిళకు రూ. 2.500, ఎకరాకు పదిహేను వేల రైతుబంధు హామీలు మర్చిపోయి గత రెండు రోజుల నుండి గాడిద గుడ్డుతో ఊరేగుతూ ఎన్నికల అనంతరం ప్రజలకు గాడిద గుడ్డే చూపిస్తారని రఘు నందన్ రావు సీఎంపై ఫైర్ అయ్యారు. గతంలో మనోహరాబాద్

    మండలంలో నిరుపేద రైతుల భూములను ఐదు, పది లక్షల చొప్పున ఇచ్చి గుంజుకొని పరిశ్రమలకు రూ. కోటి నుండి ఐదు కోట్ల వరకు అమ్ముకున్న ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు. ఈ ప్రాంత రైతుల భూములను లాక్కొని ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారని రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ కాలం నుండి ఇందిరాగాంధీ వరకు ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని మార్చారని, బీసీల రిజర్వేషన్లు తగ్గించి మైనార్టీల రిజర్వేషన్లను పెంచిన ఘనత, ఎమర్జెన్సీ ఏర్పాటు చేసిన ఘనత వారిదేనన్నారు. 10 సంవత్సరాల ప్రధాని మోదీ పాలనలో భారతదేశం యావత్ ప్రపంచానికి దిక్సూచిగా మారిందన్నారు. కరోనా కష్టకాలంలో భారతదేశం ప్రపంచంలో 100 దేశాలకు పైగా కరోనా టీకాలను అందజేసి ప్రజల ప్రాణాలను కాపాడిన ఘనత భారతదేశానికి దక్కిందన్నారు.

     కేంద్రంలో కాంగ్రెస్ పాలనలో దేవాలయాల వద్ద, చాట్ బండార్​ వద్ద, గోకుల్ చాట్ , లుంబిని పార్కుల లో బాంబుల దాడులు జరిగి ఎంతోమంది అమాయకులు మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ హయాంలో భారతదేశ దీపావళి తారాజువ్వలతో సంబరాలు జరుపుకుంటున్నారని, 500 ఏళ్ల కల అయిన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగి ప్రశాంత వాతావరణ నెలకొందన్నారు. భారతదేశంపై అటు చైనా ఇటు పాకిస్తాన్ దేశాలు మోడీ లేకుంటే ఎప్పుడో బాంబులు వేసి అంతం చేసే వారని మోడీ ఉండడం వల్లనే దేశం పైకి కన్నెత్తి చూస్తలేరని గుర్తు చేశారు. ఈసారి బీజేపీ ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించి మూడవసారి భారతదేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీని చేస్తే దేశ భద్రతతో పాటు యువకులు అభివృద్ధి చెందుతారన్నారు.

     ప్రచారం అనంతరం ఆయా గ్రామాలలో ఉన్న శ్రీ ఆంజనేయ , బంగారమ్మ, సీతారామ దేవాలయాలలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ మీ మీ గ్రామాలలో గ్రామపంచాయతీల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ ప్రధాని మోడీ మంజూరు చేసిన కేంద్రం నిధులేనని తెలిపారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ చారి, నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్, చంద్రశేఖర్ ముదిరాజ్, జక్కిడి నరేందర్ రెడ్డి, ఐలయ్య యాదవ్, బీజేవైఎం నాయకులు అజయ్ కుమార్, కిరణ్ కుమార్ యాదవ్ లతోపాటు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News