ఎన్నికల తీర్పులో నడిగడ్డ విలక్షణం !

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నడిగడ్డ గా పిలువబడే గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు ఎన్నికల తీర్పులో విలక్షణంగా ఉంటున్నాయి.

Update: 2024-05-05 02:24 GMT

దిశ, అయిజ: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నడిగడ్డ గా పిలువబడే గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు ఎన్నికల తీర్పులో విలక్షణంగా ఉంటున్నాయి. 2023 డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా, ఈ రెండు నియోజకవర్గాలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందగా, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందటంతో విలక్షణంగా నడిగడ్డ ప్రజలు తీర్పును ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో కూడా ఇటువంటి విలక్షణ తీర్పుకు నడిగడ్డ ప్రాంతం వేదికైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్వాల జిల్లాకు రావడం పై సర్వత్రా ప్రజలకు ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా ఎంపీ ఎన్నికల ప్రచార సభకు ఎర్రవల్లికి రాహుల్ గాంధీతో కలిసి రానుండటంతో ఇక్కడి సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుందని నాయకులు, రైతులు, కార్మికులు, కర్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సభలో నడిగడ్డకు ఎటువంటి హామీలు ఇస్తారో అని ప్రజలు ఉత్కంఠగా చర్చించుకుంటున్నారు.

హామీల అమలుపై ఆశలు..

గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వివిధ పార్టీల నాయకులు నడిగడ్డ లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చారు. ఏడాది క్రితం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అలంపూర్ మండలం గొందిమల్ల, వెళుటూరు మధ్య 40 టీఎంసీల సామర్థ్యంతో కృష్ణా నదిపై జోగులాంబ పేరుతో బ్యారేజి నిర్మించి అలంపూర్, కొల్లాపూర్ ప్రాంతాల ప్రజల తాగు, సాగు నీటి ఇబ్బందులు తీర్చనున్నట్లు ప్రకటించారు. గద్వాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మేము గెలిస్తే నెట్టెంపాడు ప్రాజెక్టు పనుల్లో పెండింగ్ పనుల కోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయించడంతో పాటు,గుర్రంగడ్డ బ్రిడ్జి ని పూర్తి చేస్తామని నాయకులు హామీలు ఇచ్చారు.

అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఒక టీఎంసీ నీటితో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మించి వడ్డేపల్లి, రాజోలి, మనోపాడ్ మండలాల రైతుల సాగునీటి ఇబ్బందులు తొలగిస్తామని ఇక్కడ పోటీలో ఉన్న నాయకులు హామీలు ఇచ్చారు. ఆలంపూర్ నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న ఆర్డీఎస్ రైతుల బాధలు తొలగించేందుకు గాను చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుండి జూరాల నీటితో లింక్ కెనాల్ ఏర్పాటు చేసి, 12 డిస్ట్రిబ్యూటర్ నుంచి 22 డిస్ట్రిబ్యూటర్ వరకు అయిజ మండల రైతులకు సాగునీరు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో నాయకులు హామీలు ఇచ్చారు. లింక్ కెనాల్ కోసం గతంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పరిశీలనకు కూడా రావడం జరిగింది.

పరిష్కరించాల్సిన సమస్యలు..

గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలను కలుపుతూ అలంపూర్ చౌరస్తా నుండి బల్గెర వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అంతర్రాస్ట్రాలను కలుపుతూ ఉన్న రహదారిని నాలుగు లైన్ల రోడ్డు చేయాలనే డిమాండ్ ఏళ్లుగా ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది. ఈ మార్గంలో ఇప్పటికే ఉన్న రోడ్డు గుంతలు పడి వాహనాలు ప్రయాణించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం అయితే ఈ రోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది. అలంపూర్ చౌరస్తాలో 100 పడకల ఆస్పత్రిని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ప్రారంభించి, సిబ్బందిని కేటాయించక పోవటంతో ఆరు నెలలుగా ఆస్పత్రి రోగులకు అందుబాటులోకి రాలేదు.

ప్రతినిత్యం నేషనల్ హైవే మీద ప్రమాదాలు జరిగిన రోగులు, అలంపూర్ తాలూకా లోని ఎనిమిది మండలాల రోగులు శస్త్రచికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం వేరే కావటంతో కర్నూలులో ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు మనకు అమలు కాక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలంపూర్ చౌరస్తాలో ఆసుపత్రి అందుబాటులోకి రాకపోవడం తో అత్యవసరంలో 150 కిలోమీటర్లు ఉన్న మహబూబ్ నగర్‌కు గాని, 250 కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ కు గానీ రోగులు వెళ్లాలంటే ప్రాణాల మీదకు వచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా ఈ సమస్యలు పరిష్కరించి నడిగడ్డ అభివృద్ధికి రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి తోడ్పాటు అందించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Similar News