ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీల దూకుడు.. క్యాంపెయినింగ్ స్ట్రాటజీ ఇదే..!

పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలు క్లైమాక్స్ దశకు చేరుకుంటున్నాయి.

Update: 2024-05-07 03:23 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలు క్లైమాక్స్ దశకు చేరుకుంటున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గెలుపునకు మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీ చంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల షెడ్యూలుకు ముందు నుంచి ప్రచారాలు ప్రారంభించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిత్వం కొంత ఆలస్యం కావడం వల్ల ప్రచారాన్ని కొంత ఆలస్యంగా ప్రారంభించారు.

అయినా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు హంగులు ఆర్భాటాలతో ప్రచారాలు చేస్తుండగా, బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తూ పట్టు సాధిస్తున్నారు. అభ్యర్థులు ఎన్నికల షెడ్యూల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడంతో పాటు, ప్రత్యర్థులపై వీలు చిక్కినప్పుడల్లా విరుచుకుపడుతూ పై చేయి సాధించుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తూ వచ్చారు. ఎన్నికలకు కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు దూకుడు పెంచారు.

పెరిగిన ఇంటింటి ప్రచారాలు..

కొన్ని వారాలుగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన అభ్యర్థులు ఇప్పుడు ఇంటింటి ప్రచారాల నిర్వహణకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఒకవైపు అభ్యర్థులు ప్రచారాలు చేస్తూ ఉండగా.. మరోవైపు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. మరోవైపు అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం రంగ ప్రవేశం చేసి ప్రచారాలు సాగిస్తున్నారు.

ఆసక్తిగా గమనిస్తున్న ఓటర్లు..

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు, వారి తరఫు నాయకులు చేస్తున్న ప్రచారాలను ఓటర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. గతంలో మాదిరిగా ఒక పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబితే విని ఓట్లు వేసే పరిస్థితిలో లేకుండా పోతున్నాయి. అందరికీ జై అంటున్నారు.. కానీ ఓటు ఎవరికి వేస్తారు అన్న అంశం బయట పడడం లేదు. అభ్యర్థుల ప్రచారాలలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ సాగుతున్నాయి.

11 వరకే ప్రచారాలు

ఈనెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారాలు 11వ తేదీ సాయంత్రం లోపే ముగియనున్నాయి. ఈ మధ్య సమయంలో ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఎవరు పై చేయి సాధిస్తారో.. వేచి చూడాల్సిదే అని రాజకీయ నిపుణులు అంటున్నారు.

Similar News