చనిపోయిన వారు బ్రతికే ఉన్నారని పింఛన్‌లు.. 2 ఏళ్లుగా డబ్బులు స్వాహా!

చనిపోయిన వారు బతికి ఉన్నారని వారి పింఛన్‌లు కాజేసిన సంఘటన మండలంలోని చిన్న పోర్ల గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2023-02-03 03:25 GMT

దిశ, ఊట్కూర్: చనిపోయిన వారు బతికి ఉన్నారని వారి పింఛన్‌లు కాజేసిన సంఘటన మండలంలోని చిన్న పోర్ల గ్రామంలో చోటుచేసుకుంది. పింఛన్ పొందుతూ కుటుంబ యజమాని చనిపోతే వారి స్థానంలో భార్యకు వితంతు పింఛన్ అందించేలా ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. పింఛన్ దారులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు తమకు పింఛను కోసం దరఖాస్తు చేసుకోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. గ్రామంలో దాదాపుగా 550 మంది వివిధ రూపాల్లో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు.

దాదాపు రెండు సంవత్సరాల కిందట చనిపోయిన వ్యక్తులను.. అధికారులు జాబితాను తొలగించకపోవడంతో దీనిని ఆసరాగా చేసుకున్న పోస్టల్ బీపీఎం, పంచాయతీ కార్యదర్శి ఫింగర్ ప్రింట్ సాయంతో ఆమెకు తెలియకుండా చనిపోయిన వారి ఆసరా డబ్బులను కాజేస్తూ వచ్చింది. కుటుంబ సభ్యుల స్థానంలో భార్యలకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ కొందరు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు ఇవ్వడంతో విచారణ నిమిత్తం రికార్డులను పరిశీలించిన కార్యదర్శికి అసలు విషయం తెలిసింది. విషయం తెలుసుకున్న పలువురు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డీఎల్పీవో సుధాకర్ రెడ్డి గురువారం గ్రామానికి చేరుకొని స్థానికులతో సమావేశమయ్యారు.

చనిపోయిన ఐదుగురి నుండి రెండు సంవత్సరాలుగా పింఛన్ డబ్బులను రూ. 2,41,920 దుర్వినియోగం అయినట్లు వారు గుర్తించారు. బీపీఎం మొత్తం రూ. 2,41,920 దుర్వినియోగానికి పాల్పడగా రూ.1,83,456 ను పంచాయతీ కార్యదర్శి రికవరీ చేసి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన బీపీఎం, కార్యదర్శిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్‌కు పూర్తి స్తాయి నివేదిస్తామని డీఎల్పీవో తెలిపారు.


Similar News