ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్

ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు

Update: 2024-01-22 14:10 GMT

దిశ,గద్వాల కలెక్టరేట్ : ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశం హాల్ లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చిన ప్రజా పిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాకు సంబంధించి ప్రజావాణి ద్వారా వచ్చే పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 28 ఫిర్యాదులు సమర్పించారని, వాటిలో ధరణికి సంబంధించిన భూ సమస్యలపై 12, ఆసరా పింఛన్ల 3, ఇతర సమస్యలకు సంబంధించి 13 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. నెలలో వచ్చిన దరఖాస్తులను హెచ్ సెక్షన్ లో రసీదు ఇవ్వాలన్నారు. కౌంటర్ పెట్టి రిపోర్ట్ తీసుకోవాలన్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు.

అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ... 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి సంబంధించి సంబంధిత అధికారులు తమ పరిధిలో ఏర్పాట్లను పూర్తి చేయాలని, ప్రోటోకాల్, మంచినీరు, స్నాక్స్, ఫ్లవర్ డెకరేషన్, ఆరోగ్య, ఫైర్, స్టాల్స్, ఆయా శాఖల అధికారులు మొదలైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, చీర్ల శ్రీనివాస్, ఆర్.డి.ఓ చంద్రకళ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News