సై'లెంట్ ఓటింగ్… గత ఎన్నికలతో పోలిస్తే మారిన ఓటరు నాడి

పార్లమెంటుకు సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని మధిర నియోజకవర్గంలో 81.82% పోలింగ్ శాతం నమోదు కాగా, ఇది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల శాతం కంటే 8 శాతం తగ్గినట్లు సమాచారం

Update: 2024-05-14 13:35 GMT

దిశ మధిర : పార్లమెంటుకు సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని మధిర నియోజకవర్గంలో 81.82% పోలింగ్ శాతం నమోదు కాగా, ఇది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల శాతం కంటే 8 శాతం తగ్గినట్లు సమాచారం. ప్రధానంగా రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ల మధ్యనే ఇక్కడ పోటీ కొనసాగగా కమలం నామమాత్రంగా మిగిలిపోయింది. ఇది ఇలా ఉండగా ఎప్పటిలాగే మధిర నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున సామాజిక, ఆర్థిక ప్రలోభాలు అనే అంశాలపై ఆధారపడి ఓటర్ల మద్దతు తెలపడంతో పోలింగ్ శాతం పెరిగింది.

కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న మధిర నియోజకవర్గంలో 20 ఏళ్లుగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ అధిపత్యంతో పాటు ప్రస్తుతం ఆ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఓటర్లు ఆ దిశగానే మొగ్గుచూపినట్లు పోలింగ్ సరళి వెల్లడించింది. ఇదే క్రమంలో గడిచిన పదేళ్లు రాష్ట్రంలో అధికారాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కూడా తమ క్యాడర్ ను క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారానికి ఉపయోగించి తమ బలాన్ని ప్రదర్శించేందుకు కృషి చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకించి పట్టణ ప్రాంతాలలో ఓటరు సాధారణ ప్రలోభాలు పక్కన పెడితే స్థానికతకు అధికారంకు మధ్య బేరీజు వేసుకుంటూ ఓటింగ్ లో పాలుపంచుకోవడం కనిపించింది.

శాసనసభ ఎన్నికలతో పోలిస్తే పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం ఎత్తులకు పై ఎత్తులు , ఓటరు ను ప్రభావితం చేసే అంశాలు అత్యంత సాధారణంగా కొనసాగిన పరిస్థితుల్లో ఆశాజీవైన మనిషి (ఓటరు) తమను ఆ పార్టీ వాళ్లు కలిశారు . ఈ పార్టీ వాళ్లు కలిసే వరకు వేచి చూద్దాం అన్న ధోరణిలో పోలింగ్ బూతులకు వచ్చేందుకు కొంత సంశయం చెందిన పరిస్థితులు కనిపించాయి. రాజకీయ పార్టీలు నాయకులు కూడా ఈ విషయంలో ముఖం చాటు వేసుకున్న పరిస్థితులు అనేక గ్రామాల్లో కనిపించింది. ప్రలోభాల ప్రభావం పెద్దగా లేకపోవడంతో పారదర్శకమైన ఓటింగ్ దిశగా మధిర సెగ్మెంట్లో ఓటర్లు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికలో తమదైన నిర్ణయాన్ని వెల్లడించారని చెప్పవచ్చు.

హస్తం పార్టీ అధికార హోదాతో ఆధిపత్యాన్ని కొనసాగించగా, కారు పార్టీ అభ్యర్థి స్థానికత తోపాటు గత ప్రభుత్వ కాలంలో చేసిన అభివృద్ధి అంశాలను, కొంత సామాజికతను బలంగా చేసుకొని పోటీ పడింది. పోటీలో ఉన్న మరో జాతీయ పార్టీ కమలం పార్టీ (బిజెపి) ఎప్పటిలాగే ఉనికిని చాటుకునే దిశగా ఓటర్ మదిని దోచుకున్నదని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రధాన భూమిక పోషిస్తున్న సీక్రెట్ బ్యాలెట్ (evm) తన నిజాయితీని ఓటర్కి అప్పగించి ఓటర్ మదిలో ఉన్న అభిప్రాయాన్ని నమోదు చేసుకున్నది. శాసనసభ ఎన్నికల్లో మధిర ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 35,452 ఓట్ల మెజారిటీ సాధించడం జరగగా, ప్రస్తుతం జరిగిన పోలింగ్ ప్రక్రియ లో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడం తోపాటు భిన్న సమీకరణాల నేపథ్యంలో మధిర నియోజకవర్గ ప్రజలు ఏ మేరకు అభ్యర్థుల భవితవ్యానికి మద్దతుగా నిలిచారు అనేది జూన్ 3 న తేటతెల్లం కానున్నది .

Similar News