తగ్గేదే లే.. ఈసారి ఆధారాలతో రేవంత్ రెడ్డికి కేసీఆర్ కౌంటర్ ట్వీట్

తెలంగాణలో కరెంట్ కోతలు, నీటి సమస్యపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Update: 2024-04-29 11:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో కరెంట్ కోతలు, నీటి సమస్యపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవలే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన కేసీఆర్.. నీటి కొరత, విద్యుత్ కొరత కారణంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ మూసివేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు నోటీసు జారీ చేయడంపై సోమవారం స్పందించారు. రాష్ట్రంలో విద్యుత్, సాగునీరు, తాగునీటి సరఫరాపై గత 4 నెలలుగా తెలంగాణ సీఎం, డీసీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యుత్, తాగునీరు, సాగునీటి ఎద్దడి ఉన్న మాట వాస్తవం అని, ఎక్కడా విద్యుత్ కోతలు, నీటి ఎద్దడి సమస్య లేదంటూ ప్రభుత్వం చేస్తున్న వాదన అబద్ధమని ఉస్మానియా యూనివర్శిటీ చీఫ్ వార్డెన్ నోటీసులే నిర్ధారిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వార్డెన్ జారీ చేసిన నోటీసుతో పాటు ఆందోళన చేస్తున్న విద్యార్థుల వీడియోను కేసీఆర్ తన ట్వీట్ లో జత చేశారు.

కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువు సృష్టించిందని, తాము అధికారంలో నుంచి దిగిపోయిన వెంటనే కట్క బంద్ చేసినట్లుగా విద్యుత్ కోతలు మొదలయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ తొలిరోజే.. 'తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ పర్యటనలో ఉండగా భోజనం చేస్తున్నం సేపట్లో రెండు సార్లు కరెంటు పోయింది. కానీ ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి' అంటూ ట్వీట్ చేశారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఖండిస్తూ ఆయన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా ఓయూ ఘటనపై రియాక్ట్ అవుతూ ప్రభుత్వ పెద్దలపై విమర్శలు గురి పెట్టారు. 

Tags:    

Similar News