ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి గంగుల

కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవమునకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రానున్నందున...Minister Gangula Kamalaker Review Meeting with officials

Update: 2022-12-06 13:30 GMT

దిశ, కరీంనగర్ టౌన్: కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవమునకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రానున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంగళవారం కరీంనగర్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ 7వ తేదీన హెలిక్యాప్టర్ ద్వారా జగిత్యాల జిల్లాకు ముఖ్యమంత్రి రానున్నారని, జగిత్యాల జిల్లాలో సమీకృత అధికారుల భవన సముదాయం(కలెక్టరేట్) తోపాటు మెడికల్ కళాశాల, జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభించి అనంతరం బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని నివాసగృహనికి చేరుకుంటారని తెలిపారు. 8వ తేదీన ఉదయం కరీంనగర్ జిల్లాలో రూ. 12 కోట్లతో అధునాతన వసతులతో నిర్మించిన ఆర్ ఆండ్ బీ అతిథి(కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌజ్) గృహానికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రివర్యులు పేర్కొన్నారు.

ప్రారంభోత్సవం అనంతరం జిల్లా కేంద్రంలోని వి-కన్వేన్షన్ లో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూతూరి వివాహ వేడుకకు హాజరు కానున్నారని తెలిపారు. రోడ్డు మార్గం ద్వారా జిల్లాలో తిరగనున్న సందర్బంగా ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని అవసరం ఉన్నచోట రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. స్పోర్ట్స్ కళాశాలలో హెలిప్యాడ్ ను సిద్దం చేయాలని సూచించారు. ఎక్కడకూడా అవసరం ఉన్న చోట రోడ్డు మరమత్తు పనులను చేపట్టాలని, తీగల గుట్టపల్లిలో నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండాలని, విద్యుత్, శానిటేషన్ సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. మొక్కలతో పచ్చగా కళకలలాడేలా చూడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, సీపీ వి. సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జి.వి. శ్యాంప్రసాద్ లాల్, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణా రావు, ఆర్ అండ్ బీ ఈఈ సాంబశివరావు, ఏఈలు లక్ష్మణ్ రావు, రాజ శేఖర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ తదితరులు పాల్గొన్నారు.

Similar News