కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా కేంద్రమంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రచారం

భారతీయ జనతా పార్టీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా బీజేపీ కేంద్ర పెద్దలు కదలి వస్తున్నారు.

Update: 2024-04-28 13:39 GMT

దిశ, శేరిలింగంపల్లి : భారతీయ జనతా పార్టీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా బీజేపీ కేంద్ర పెద్దలు కదలి వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి, ఒలింపిక్ విజేత రాజవర్ధన్ సింగ్ రాథోడ్ కొండ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ అయ్యప్ప సోసైటీలో నిర్వహించిన రోడ్ షోలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన చేవెళ్ల ప్రాంత అభివృద్ధిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఎంతో ముందు చూపు ఉందన్నారు.

2014 నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీగా తనకు తెలుసని, ఆయన ప్రతినిత్యం చేవెళ్ల ప్రాంత అభివృద్ధి కోసమే శ్రమిస్తారని రాజ వర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబం రంగారెడ్డి జిల్లాకు ఎంతో సేవ చేసిందని వారి తండ్రి, తాత చూపిన మార్గంలోనే ఆయన కూడా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. తన ప్రజల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించుకున్న గొప్ప నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అని అన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95శాతం అటెండెన్స్ తో సహచర ఎంపీలందరికీ మార్గదర్శకంగా వ్యవహరించారని రాజ వర్ధన్ సింగ్ రాథోడ్ గుర్తు చేశారు.

మరోసారి ఆయనను ఎంపీగా గెలిపించడం ద్వారా చేవెళ్ల ప్రాంతం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని, గత పదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని, ఆ అభివృద్ధిని, ఆ సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. యూపీఏ హయాంలో దేశ రక్షణ పై కాంగ్రెస్ నాయకులు శ్రద్ధ చూపలేదని రాజ వర్ధన్ సింగ్ రాథోడ్ విమర్శించారు. గత పదేళ్లలో దేశ రక్షణకు అవసరమైన ప్రతి ఆయుధాన్ని పరికరాన్ని ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా మనమే తయారు చేసుకున్నామని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు గ్రామాల్లో అభివృద్ధి కనిపించిందని రాజవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపారు. కొండా

కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్రం సిద్ధించి 2047 నాటికి వందేళ్లు పూర్తవుతుందని అప్పటిలోగా ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకే భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించిందని అన్నారు. దేశంలో ఎయిర్ పోర్టుల నుండి మొదలుకొని రహదారులు, రైతు వేదికలు చివరికి గ్రామాల్లో వైకుంఠధామాల వరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసిన ఘనత నరేంద్ర మోడీకి మాత్రమే దక్కుతుందన్నారు.

బిజెపి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమన్నారు. ముస్లిం రిజర్వేషన్ వల్ల ఓబీసీలు ఎంతో నష్టపోతున్నారని ఇది సుప్రీంకోర్టు తీర్పులకు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆయన గుర్తు చేశారు. మైనారిటీలు, ముస్లింల పేరు చెప్పే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. ముస్లిం మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించేది మాత్రం నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ మాత్రమేనని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, బీజేపీ నాయకులు శ్రీధర్ రెడ్డి, ఆంజనేయులు, పద్మ, కవిత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

Similar News