స్లిప్ స్కిప్ కావొద్దు.. డీజీపీ, స్టేట్ సీఈఓలకు అందజేసిన రోనాల్డ్ రోస్

గ్రేటర్ హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం దృష్టి సారించి ఓటరు అవగాహన కార్యక్రమాలను చేపట్టింది.

Update: 2024-04-28 02:14 GMT

దిశ, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం దృష్టి సారించి ఓటరు అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌లను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ శుక్రవారం పలువురు ఉన్నతాధికారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. బంజారాహిల్స్‌లోని డీజీపీ రవిగుప్త, ఎస్ఆర్ నగర్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఇంటికెళ్లి ఓటరు స్లిప్‌లను అందజేశారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి అందించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని, తమకు నచ్చిన ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలన్నారు. ఓటు వేయటం మన హక్కుతో పాటు మన బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. మే 13న జరగనున్న పోలింగ్‌లో ప్రతి ఒక్క ఓటరు తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వయం సహాయక బృందాలు, టౌన్ లెవెల్ ఫెడరేషన్‌తో పాటు స్లమ్ లెవెల్ ఫెడరేషన్, స్వచ్చంధ సంస్థలతో పాటు పలు సినీ సెలబ్రిటీలతో ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలని అన్నారు. ప్రజాస్వామ్య మనుగడ దేశ భవిష్యత్తుకు ఓటు ఒక ఆయుధం లాంటిదని, పార్లమెంట్ ఎన్నికలు మే 13న ఓటింగ్‌ను ప్రజాస్వామ్య పండుగ భావించాలని అన్నారు. ఎపిక్ కార్డు ఉంటే సరిపోదని ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో సరి చూసుకోవాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ శాతం స్లిప్‌ల పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ సీఈఓకు వివరించారు. డీజీపీ రవిగుప్త మాట్లాడుతూ..రాష్ట్రంలో మే 13న ఓటింగ్‌కు ఏర్పాటుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కమిషనర్ వెంట ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బీ.హేమంత్ సహదేవ్ రావు, జూబ్లీహిల్స్, బేగంపేట డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Similar News