బీజేపీ గెలుపే మాదిగల గెలుపు : మందకృష్ణ మాదిగ

బీజేపీ గెలుపే మాదిగల గెలుపుగా భావించి బీజేపీ అభ్యర్థులను గెలిపించడంలో మాదిగ విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

Update: 2024-04-28 10:31 GMT

దిశ, సికింద్రాబాద్: బీజేపీ గెలుపే మాదిగల గెలుపుగా భావించి బీజేపీ అభ్యర్థులను గెలిపించడంలో మాదిగ విద్యార్థులు క్రియాశీలక పాత్ర పోషించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మాదిగ జాతిని మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని సూచించారు. ఎంఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు మంద రాజు మాదిగ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల మాదిగ విద్యార్థుల సదస్సును ఉస్మానియా యూనివర్సిటీ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందన్నారు.

వర్గీకరణ లేకుంటే మాదిగ జాతికి అంధకారమేనని పేర్కొన్నారు. వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలుగా ఉద్యమం కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు ద్వారా వర్గీకరణ బీజేపీ పూర్తి చేయబోతున్న విషయం కళ్ళ ముందు కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తామని నమ్మించి మాదిగ జాతిని మోసం చేసిందన్నారు. రాజకీయ అవకాశాలు మాదిగలకు ఇవ్వకుండా అవమానానికి గురి చేసిందన్నారు.

బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మాదిగలను అణగదొక్కిందన్నారు. మాదిగ జాతి బిడ్డలందరూ బీజేపీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలుపు కోసం యూనివర్సిటీ విద్యార్థులు శ్రమించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తీక్ మాదిగ, అధికార ప్రతినిధి కొమ్మ శేఖర్ మాదిగ, ప్రధాన కార్యదర్శి బొచ్చు తిరుపతి మాదిగ, జాతీయ ఉపాధ్యక్షులు చిరంజీవి మాదిగ, జాతీయ కార్యదర్శి పల్లెల సుధాకర్ మాదిగ, కార్యదర్శులు శివకుమార్, ముఖేష్ , పలు యూనివర్సిటీల ఎంఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News