బ్రేకింగ్: Telangana నూతన సీఎస్‌గా Shantikumari

తెలంగాణ కొత్త సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి నియామకమైయ్యారు.

Update: 2023-01-11 10:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్‌ను ఏపీకి వెళ్ళిపోవాల్సిందేనంటూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించడంతో ఆయన స్థానంలో శాంతికుమారిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శేషాద్రి బుధవారం మధ్యాహ్నం ఆర్డర్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారి రికార్డు సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాలకు జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా, విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆమె స్థానికంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినా విభజన సమయంలో తెలంగాణ కేడర్‌గా అలాట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎంఓ కార్యదర్శిగా, కరోనా సమయంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

సీనియారిటీ ప్రకారం ఆమెకంటే పలువురు ఐఏఎస్‌లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతికుమారికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆర్థిక శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు పేరు సైతం పరిశీలనలో ఉన్నా ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఇద్దరితో చర్చలు జరిపిన తర్వాత శాంతికుమారి పేరును ఫైనల్ చేశారు. ఆమె 2025 ఏప్రిల్ వరకూ సర్వీసులో కొనసాగనున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆమెకు సీఎస్‌గా అవకాశం కల్పించడం గమనార్హం. రామకృష్ణారావును సీఎస్‌గా నియమిస్తున్నట్లు వార్తలు వచ్చినా ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ శాఖ స్పెషల్ సీఎస్‌గానే కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆయనే ఆ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

 Also Read...

మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్ణయానికి బీఎస్పీ స్టేట్ చీఫ్ మద్దతు 

కేసీఆర్ కు కింది స్థాయి ఉద్యోగి సలహా!

Tags:    

Similar News