అందుబాటులో లేని వారు ఆందోళన చెందవద్దు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల్లో లబ్ధి పొందాలనుకునేవారు ఆయా గ్రామాల్లో నిర్ణీత తేదీల్లో నిర్వహించే గ్రామ సభల్లో అందుబాటులో లేని వారు ఆందోళనకు గురి కావద్దని తహసీల్దార్ మోతిరాం, ఎంపీడీవో సాల్మన్ రాజ్‌లు సూచించారు.

Update: 2023-12-30 06:23 GMT

దిశ, లోకేశ్వరం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల్లో లబ్ధి పొందాలనుకునేవారు ఆయా గ్రామాల్లో నిర్ణీత తేదీల్లో నిర్వహించే గ్రామ సభల్లో అందుబాటులో లేని వారు ఆందోళనకు గురి కావద్దని తహసీల్దార్ మోతిరాం, ఎంపీడీవో సాల్మన్ రాజ్‌లు సూచించారు. శనివారం లోకేశ్వరం మండలంలోని హవర్గా పిప్రి, నగర్ గ్రామాల్లో ఎంపీడీవో, జోహార్ పూర్, వాటోలి గ్రామాల్లో తహసీల్దార్‌లు ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో అందుబాటులో లేని వారు జనవరి 6వ తేదీ వరకు పంచాయతీ సెక్రటరీలకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. దరఖాస్తులు అందజేసేందుకు ఇంకా వారం రోజులు గడువు ఉన్నందున ఆయా గ్రామాల్లో నిర్వహించే సభలో ఒకేరోజు క్యూలైన్లలో పెద్ద మొత్తంలో వేచి ఉండకూడదని అన్నారు.

ఒక కుటుంబానికి ఒకటే దరఖాస్తు ఫారం తీసుకోవాలి

ఆరు గ్యారెంటీ పథకాల్లో లబ్ధి పొందాలనుకునేవారు ఒక కుటుంబానికి ఒకటే దరఖాస్తు ఫారం తీసుకొని పూర్తి చేసి ఇవ్వాలని సూచించారు. అనవసరంగా రెండు మూడు ఫారాలు తీసుకొని ఇతరులకు లభించకుండా ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. ఇప్పటివరకు పింఛన్ తీసుకుంటున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదని, మిగతా పథకాల్లో దేనికి అర్హులైతే వాటి వివరాలతో కూడిన జిరాక్స్ పత్రాలను దరఖాస్తుకు జత చేయాలని సూచించారు.

Tags:    

Similar News