థామస్ కప్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్.. క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత

చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక థామస్ కప్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషులు జట్టు జోరు ప్రదర్శిస్తున్నది.

Update: 2024-04-29 13:24 GMT

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక థామస్ కప్‌ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషులు జట్టు జోరు ప్రదర్శిస్తున్నది. గ్రూపు-సిలో ఆడుతున్న భారత జట్టు తొలి మ్యాచ్‌లో థాయిలాండ్‌ను ఓడించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన రెండో గ్రూపు మ్యాచ్‌లో అదే దూకుడు కొనసాగించి ఇంగ్లాండ్‌ను 5-0 తేడాతో చిత్తు చేసింది. దీంతో గ్రూపులో వరుసగా రెండు విజయాలతో భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21-15, 21-15 తేడాతో హ్యారీ హువాంగ్‌ను ఓడించి జట్టుకు శుభారంభం అందించాడు.

ఆ తర్వాత డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-17, 19-21, 21-15 తేడాతో బెన్ లేన్-సీన్ వెండి జంటను ఓడించి ఆధిక్యాన్ని రెట్టింపు చేయగా.. రెండో సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-16, 21-11 తేడాతో నదీమ్ దల్విని మట్టికరిపించడంతో భారత్ విజయం ఖరారైంది. ఇక, నామమాత్రపు డబుల్స్ మ్యాచ్‌లో అర్జున్-ధ్రువ్ కపిల 21-17, 21-19 తేడాతో రోరె ఈస్టన్-అలెక్స్ గ్రీన్‌ను ఓడించగా.. చివరిదైన సింగిల్స్ మ్యాచ్‌లో కిరణ్ జార్జ్ 21-18, 21-12 తేడాతో చోళన్ కయాన్‌పై గెలుపొందడంతో భారత్‌ మ్యాచ్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం చివరి గ్రూపు మ్యాచ్‌లో బలమైన ఇండోనేషియాను ఎదుర్కోనుంది. ఉబెర్ కప్‌లో మహిళల జట్టు కూడా క్వార్టర్ ఫైనల్‌‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News