ఉబెర్ కప్‌లో మహిళల జట్టు జోరు.. క్వార్టర్స్‌ బెర్త్ ఖాయం

ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

Update: 2024-04-28 14:15 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. గ్రూపు-ఏలో వరుసగా రెండు విజయాలు సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ముందడుగు వేసింది. తొలి మ్యాచ్‌లో కెనడాను ఓడించిన భారత్.. ఆదివారం జరిగిన రెండో గ్రూపు మ్యాచ్‌లో సింగపూర్‌ జట్టును 1-4 తేడాతో చిత్తు చేసింది. తొలి గేమ్‌లో అష్మిత ఓటమితో జట్టుకు శుభారంభం దక్కలేదు. యో జియో మిన్ చేతిలో 21-15, 21-18 తేడాతో ఓటమిపాలైంది.

ఆ తర్వాత డబుల్స్ మ్యాచ్‌లో ప్రియ-శ్రుతి జంట 21-15, 21-16 తేడాతో జియావో ఎన్ హెంగ్-జిన్ యు జియా‌పై నెగ్గడంతో భారత్ పుంజుకుంది. ఆ తర్వాత సింగిల్స్ మ్యాచ్‌లో ఇషారాణి 21-13, 21-16 తేడాతో ఇన్సిరా ఖాన్‌పై గెలుపొంది ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. రెండో డబుల్స్ మ్యాచ్‌లో సిమ్రాన్-రితిక జోడీ 21-8, 21-11 తేడాతో ఎల్సా లై యి టింగ్-మిచెల్ జాన్‌ను చిత్తు చేయడంతో భారత్ విజయం లాంఛనమైంది. ఇక, చివరి సింగిల్స్ మ్యాచ్‌లో అన్మోల్ ఖర్బ్ 21-15, 21-13 తేడాతో మెగాన్ లీని ఓడించడంతో భారత్‌కు భారీ విజయం దక్కింది. మంగళవారం చివరి గ్రూపు మ్యాచ్‌లో బలమైన చైనాతో తలపడనుంది. 

Tags:    

Similar News