Qatar World Cup: ఫిఫా వరల్డ్ కప్‌లో తొలిసారి మహిళా రిఫరీలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఖతార్‌లో జరిగే ఫిఫా ఫుట్‌బాల్ - Female referees included in men's FIFA World Cup for first time

Update: 2022-05-19 14:43 GMT

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఖతార్‌లో జరిగే ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌‌లో రిఫరీలుగా వ్యవహరించే జాబితాలో మహిళలకు చోటుదక్కింది. గురువారం ఫిఫా రిఫరీ కమిటీ వరల్డ్ కప్‌కు సంబంధించి మ్యాచ్ అఫీషియల్స్‌ జాబితాను విడుదల చేసింది. 36 మంది రిఫరీలు, 69 మంది అసిస్టెంట్ రిఫరీలు, 24 మంది వీడియో మ్యాచ్ అఫీషియల్స్‌ను ఎంపిక చేశారు. ఇందులో ముగ్గురు మహిళా రిఫరీలు, మరో ముగ్గురు మహిళా అసిస్టెంట్ రిఫరీలు ఉన్నారు. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో రిఫరీ కమిటీ మహిళా రిఫరీలను నియమించడం ఇదే తొలిసారి. స్టెఫానీ ఫ్రాపార్ట్(ఫ్రాన్స్), సలీమా ముకన్‌సంగా(రువాండా),యోషిమి యమషితా(జపాన్) రిఫరీలుగా వ్యవహరించనుండగా.. న్యూజా బ్యాక్(బ్రెజిల్), కరెన్ డియాజ్ మదీనా(మెక్సికో), కాథరిన్ నెస్సిబ్(యూఎస్ఏ) అసిస్టెంట్ రిఫరీలుగా ఉండనున్నారు. తమకు జెండర్‌తో పనిలేదని, మ్యాచ్‌లో క్వాలిటీ పాటించడమే ముఖ్యమని ఫిఫా రిఫరీ కమిటీ చైర్మన్ పియర్లుయిగి కొల్లినా తెలిపారు. భవిష్యత్తులో కీలకమైన పురుషుల టోర్నమెంట్‌లకు సైతం మహిళా అఫీషియల్స్‌ను నియమించడం సాధారణంగా మారుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.


Similar News