AP Politics: సెంటిమెంట్‌ను చెరిపేస్తారా..? అక్కడ హ్యాట్రిక్ కొడతారా..?

కడప అసెంబ్లీ చరిత్రలో ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు పోటీ చేసిన వారు కానీ, మూడుసార్లు విజయం సాధించిన వారు కానీ లేరు.

Update: 2024-05-04 03:23 GMT

దిశ, ప్రతినిధి కడప: కడప అసెంబ్లీ చరిత్రలో ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు పోటీ చేసిన వారు కానీ, మూడుసార్లు విజయం సాధించిన వారు కానీ లేరు. ఇందుకు తోడు రెండుసార్లు గెలుపొందిన వారికి ఆ తర్వాత ఆ పార్టీ నుండి టిక్కెట్ దక్కకపోవడం, వారు పోటీలో లేకుండా పోవడం లాంటి పరిణామాలు కడపలో కనిపిస్తూ వస్తున్నాయి. అయితే ఈ సెంటిమెంట్ ను ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా చెరిపేస్తారా?

రెండుసార్లు వరుస విజయాలు సాధించి మూడోసారి పోటీ చేస్తున్న ఆయన ఈసారి విజయం పొందితే హ్యాట్రిక్ కొట్టడమే కాదు.. కడప అసెంబ్లీ చరిత్రలో ఇప్పటివరకు లేని ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటారు. ఒకవేళ ఎన్నికల్లో విజయం సాధిస్తే కడప అసెంబ్లీ రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక ప్రస్థానంగా మారుతుంది.

*హ్యాట్రిక్ లేని కడప

కడప అసెంబ్లీలో ఇప్పటివరకు ఎవరు వరుసగా మూడుసార్లు గెలిచిన పరిస్థితులు లేవు.1952 నుంచి 2019 వరకు 15 సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వరుసగా నలుగురు మాత్రమే రెండు రెండు సార్లు గెలుపొందారు. అంతకుమించి మూడుసార్లు గెలుపు పొందిన హ్యాట్రిక్ కొట్టిన వారు ఇప్పటివరకూ లేరు. ప్రధాన పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు టికెట్ పొందిన వారు లేరు.

16 వ సారి జరుగుతున్న 2024 ఎన్నికల్లో మూడోసారి వరుసగా ఒకే పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్న ఘనత అంజద్ బాషాకే దక్కింది. వైసీపీ టికెట్‌తో పాటు విజయం కూడా మూడోసారి వరిస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు.

రెండు, రెండు సార్లు గెలిచిన నలుగురు

19 52 నుంచి కడప అసెంబ్లీ లో ఎన్నికైన ఎమ్మెల్యేలను గుర్తు చేసుకుంటే నలుగురు మాత్రమే రెండు, రెండు సార్లు గెలుపొందారు. అసెంబ్లీ ఏర్పాటైనప్పటి నుంచి చూస్తే 1952లో కడప కోటిరెడ్డి కాంగ్రెస్ నుండి, 1955లో కాంగ్రెస్ నుండే ఎస్ ఎం రహమతుల్లా ఎన్నికయ్యారు.1962 లో ఇండిపెండెంట్‌గా పి.శేషయ్య, 1972 ,1978 ఎన్నికల్లో గజ్జల మల్లారెడ్డి కాంగ్రెస్ నుండి రెండు సార్లు వరుసగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక 1983లో రామమునిరెడ్డి,1985 ఉప ఎన్నికల్లో సి.రామచంద్రయ్యలు టీడీపీ నుంచి ఎన్నికయ్యారు.

1989లో కాంగ్రెస్ నుండి కందుల శివానందరెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1994లో మైనార్టీ అభ్యర్థిగా టీడీపీ నుంచి ఖలీల్ భాషా ఎన్నికయ్యారు. 1999 లోనూ ఆయనే గెలిచారు. రెండు సార్లు గెలిచిన ఈయనకు మూడోసారి టీడీపీ నుంచి టిక్కెట్ దక్కలేదు. 2004, 2009 లో అహ్మదుల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆయన కూడా మూడోసారి పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014, 2019 ప్రస్తుత వైసీపీ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గెలిచారు. ఆయనకు గతంలో ఎవ్వరికీ దక్కనట్లుగా మూడో సారి కూడా టికెట్ దక్కడంతో ఆయన హ్యాట్రిక్ రేస్ లో ఉన్నారు. గెలుపపోటములను ప్రభావితం చేసే మైనార్టీ ఓట్లు బలంగా ఉన్న కడపలో ఆయన మూడోసారి పోటీ చేయడంపై గెలుపు ధీమాతో ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు , అభివృద్ధి, బడుగు, బలహీన వర్గాలు తమకు అండగా నిలబడతారన్న నమ్మకంతో ఉన్నారు. మరి అంజద్ బాషా కడపలో ఉన్న సెంటిమెంటును చెరిపేసి హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాలి.

Similar News