Gudivada Amarnath: అమర్‌‌ను అలుముకున్న కష్టాలు.. చిక్కుల్లో గుడివాడ..

గాజువాక నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ ‌అమర్నాధ్‌‌కు కొత్తగా గంగవరం పోర్టు సమ్మె వెంటాడుతోంది.

Update: 2024-05-02 03:25 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: గాజువాక నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ ‌అమర్నాధ్‌‌కు కొత్తగా గంగవరం పోర్టు సమ్మె వెంటాడుతోంది. గత 20 రోజులుగా అదానీ గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగుల సమ్మె కారణంగా మూతపడింది. విశాఖ ఉక్కు కర్మాగారం ముడిసరకు ఇక్కడ చిక్కుకుపోయి దీని ప్రభావం స్టీల్ ప్లాంట్‌పై తీవ్రంగా పడింది.

గంగవరం నిర్వాసిత గ్రామాలు, ఉక్కు నగరం గాజువాక అసెంబ్లీ పరిధిలోనేవుండడం, సమస్య ఇప్పుడు తీవ్రతరం కావడం, రాష్ర్ట ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేయడం ఇప్పుడు అమర్‌ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

గతంలో చర్చలు జరిగినప్పుడూ ఏమీ చేయని అమర్

ఎన్నికల కోడ్ రాకముందు నుంచే గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగుల సమస్య కొనసాగుతోంది. ఆరు నెలల క్రితం కూడా జిల్లా కలెక్టర్ వద్ద అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య చర్చలు జరిగాయి. కొన్నింటిపై అంగీకారం కూడా కుదిరింది. అయితే అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం అప్పుడు అంగీకరించిన షరతులను కూడా అమలు పర్చలేదు.

పరిశ్రమల శాఖా మంత్రిగా గుడివాడ అమర్నాధ్ సొంత జిల్లాలోని సమస్యను నిర్లక్ష్యం చేశారు. పరిశ్రమల శాఖపై పెద్దగా పట్టులేకుండా కోడిగుడ్డు మంత్రిగా పేరుపడి అభాసు పాలైన ఆయన అదానీ పోర్టు వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. అనకాపల్లి శాసనసభ్యుడిగా వుండడం, సమస్య గాజువాకలో వుండడంతో తనకేమిటిలే అన్నట్లు వ్యవహరించారు. తీరా ఇప్పుడు ఆయనే గాజువాకకు మారడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.

డిమాండ్లు ఇవే

గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగులు తమను స్వంచ్ఛంద పదవీ విరమణ చేయిస్తే తక్షణమే రూ.35 లక్షలు చెల్లించాలని, తమను ఉద్యోగంలో కొనసాగిస్తే రూ.36 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున నిబంధనల మేరకు పోర్టు ఆవరణలో ఆస్పత్రి నిర్మించాలని కోరుతున్నారు. ఇవన్నీ హేతుబద్ధమైన డిమాండ్లే. పక్కనే వున్న విశాఖ పోర్టులో ఇంతకంటే ఎక్కువ పరిహారం, వేతనం లభిస్తుంది. రెండు రోజుల క్రితం ఈ డిమాండ్ల మీద లేబర్ కమిషనర్ గణేష్ వద్ద జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి.

పోర్టు వాటాల అమ్మకమే కొంప ముంచింది

గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 11 శాతం వాటా వుండేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరవాత అదానీకి ఈ వాటాలను రహస్యంగా గుట్టుచప్పుడు కాకుండా అమ్మేశారు. దీంతో రాష్ర్ట ప్రభుత్వానికి చర్చలలో పెద్దగా పాత్ర ఏమీ లేకుండా పోయింది. అదానీతో ముఖ్యమంత్రి జగన్ సన్నిహితంగా వుంటుండడంతో జిల్లా అధికారులు కూడా చర్చలలో తమ అభిప్రాయం చెప్పలేకపోతున్నారు. అదానీ యాజమాన్యం చెప్పింది వినడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. ఇదే ఇప్పుడు ఇటు అసెంబ్లీ అభ్యర్థి అమర్‌కు, అటు లోక్‌సభ అభ్యర్థి బొత్స ఝాన్సీకి ఇబ్బందికరంగా మారింది.

Similar News