గొల్లగట్టులో డిల్లెం బల్లెం.. అంగరంగ వైభవంగా జాతర

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరైన పెద్దగట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. యాదవ సోదరుల డిల్లెం బల్లెం శబ్దాలకు తోడు భక్త కోటి చేస్తోన్న ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు పరిసరాలు మారుమోగుతోంది. యాదవులు తమ ఇలవేల్పుగా భావించే లింగమంతుల స్వామి జాతర… అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం రాత్రి కేసారం నుంచి పెద్దగుట్టకు దేవరపెట్టె తరలిరావడంతో… ప్రత్యేక పూజల అనంతరం జాతర మొదలైంది. గంపలు నెత్తినెత్తుకొని బోనాలు, పోలు ముంతలు, […]

Update: 2021-03-01 12:51 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరైన పెద్దగట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. యాదవ సోదరుల డిల్లెం బల్లెం శబ్దాలకు తోడు భక్త కోటి చేస్తోన్న ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు పరిసరాలు మారుమోగుతోంది. యాదవులు తమ ఇలవేల్పుగా భావించే లింగమంతుల స్వామి జాతర… అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం రాత్రి కేసారం నుంచి పెద్దగుట్టకు దేవరపెట్టె తరలిరావడంతో… ప్రత్యేక పూజల అనంతరం జాతర మొదలైంది. గంపలు నెత్తినెత్తుకొని బోనాలు, పోలు ముంతలు, పసుపు సమర్పించేందుకు… భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. దేవరపెట్టే పెద్దగట్టుకు చేరుకున్న అనంతరం… మొక్కులు చెల్లించుకున్నారు. లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లిని దర్శించుకునేందుకు… పోటీ పడుతున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా యాదవుల విన్యాసాలు..

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర పూర్తిగా యాదవ సంప్రాదాయ ప్రకారమే జరుగుతుంది. రెండేండ్లకోసారి జరిగే గొల్లగట్టు జాతరలో యాదవ సోదరులు చేసే విన్యాసాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. లింగమంతుల స్వామికి మొక్కులు సమర్పించేందుకునేందుకు కుటుంబ సమేతంగా గంపలు, బోనాలు నెత్తిన ఎత్తుకుని పోలుముంతలు, పసుపు బియ్యంతో బంధుగణం సమేతంగా పెద్దగట్టుకు చేరుకుంటారు. గట్టుపైకి చేరుకునే క్రమంలో యాదవ సోదరులు గజ్జెల లాగులు ధరించి, కత్తులు, కటార్లతో ప్రత్యేక విన్యాసాలు చేస్తారు. డప్పు వాయిద్యాలతో లయబద్దంగా అడుగులు వేస్తూ చేసే లింగనామస్మరణతో తన్మయత్వం చెందుతారు.

యావత్ దేశం నుంచి భక్తుల రాక..

తెలంగాణలోనే వైభవోతంగా సాగే పెద్దగట్టు జాతరకు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. తాము కోరుకున్న కోర్కెలు తీరినవారంతా మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. తెలంగాణలోని యాదవ సోదరులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో దురాజ్‌పల్లిగుట్టతో పాటు సూర్యాపేట పట్టణ పరిసరాలన్నీ ఇసుకెస్తే రాలనంత భక్తజనం రద్దీ నెలకొంటుంది. భక్తులు యాట(మేకపోతు, గొర్రెపోతు)లను లింగమంతుల స్వామికి సమర్పించి.. జాతరకు వచ్చిన బంధువులకు విందు భోజనాలు పెడతారు. జాతరకు వచ్చే భక్తులు రెండు నుంచి మూడు రోజుల వరకు దురాజ్‌పల్లిలోనే ఉంటారు.

దారులన్నీ పెద్దగట్టు వైపు..

యాదవుల ఆరాధ్య దైవం.. తరతరాల ఆచారం.. మహిమాన్వితులకు ప్రతిరూపం.. గొల్లగట్టు(పెద్దగట్టు) జాతర. తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు జాతరకు భక్తజనం పోటెత్తుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి దారులన్నీ పెద్దగట్టు వైపునకే మళ్లాయి. పుట్ట నుంచి చీమలు బారుదీరినట్టు భక్తకోటి జనమంతా దురాజ్‌పల్లి గుట్టకు బారులుదీరారు. చేతిలో కత్తులు, కటార్లు, గొర్రెపోతులతో ఓ లింగ నామస్మరణతో అడుగులో అడుగులేస్తూ లయబద్ధంగా సాగుతుంటే.. ఆ దృశ్యాలు ఎంతో కనువిందు చేస్తున్నాయి. పున్నమి వెన్నెలలో యాదవుల విన్యాసాలు, గంపలు, నిండుకుండ బోనాలతో లింగమంతుల స్వామి చుట్టూ చేసే ప్రదక్షిణలు సరికొత్త భక్తి తన్మయత్వాన్ని కలిగిస్తోంది. 300 వందల ఏండ్ల ఘనమైన చరిత్ర ఉన్న ఈ జాతరను ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించడం ఆనవాయితీ. ఈ జాతరలో యాదవుల ఇలవేల్పు అయిన లింగమంతుల స్వామి, యలమంచిలమ్మ, గంగమ్మ, శివుడి సోదరి సౌడమ్మలు కొలువైన పెద్దగట్టును అత్యంత మహిమాన్విత ప్రదేశంగా యాదవులు భావిస్తుంటారు. తమ సంపదలైన గొర్రె జీవాలను, తమను కూరమృగాల నుంచి కాపాడాలని లింగమంతుల స్వామని యాదవులు వేడుకుంటారు.

పెద్దగట్టు జాతరకు చేరుకోవడం ఇలా..

సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దురాజ్‌పల్లి గుట్ట వద్ద లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఈ దురాజ్‌పల్లి గుట్ట హైదరాబాద్-విజయవాడ ప్రదాన రహదారిపై ఉంది. ఇక్కడికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటు సొంత వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది. సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రత్యేకంగా బస్సులను సైతం నడిపిస్తోంది. హైదరాబాద్, ఖమ్మం, జనగామ, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా మొదటగా సూర్యాపేట ఆర్టీసి బస్టాండ్‌కు చేరుకుంటారు. కొన్ని బస్సులు నేరుగా దురాజ్‌పల్లి గుట్ట వరకు వెళతాయి. విజయవాడ, కోదాడ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆర్టీసీ బస్సు ఎక్కితే.. గుట్ట వద్దే దిగొచ్చు. అలా కాకుండా ప్రైవేటు వాహనాల్లో వచ్చేవారు.. నేరుగా జాతర వద్దకు చేరుకుంటారు. కానీ వాహనాలు గుట్టకు కిలోమీటరుకు పైగా దూరంలో ఆగి నడుచుకుంటూ గుట్టపైకి వెళ్లాలి.

జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులు..

పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన వాహనాలను నార్కట్‌పల్లి వద్ద డైవర్ట్ చేశారు. నార్కట్‌పల్లి నుంచి వయా నల్లగొండ బైపాస్ రోడ్డు, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ మీదుగా మళ్లించారు. కోదాడలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి టచ్ అవుతారు. అక్కడి నుంచి విజయవాడకు చేరుకుంటారు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వారు సైతం కోదాడ వద్ద డైవర్ట్ అవ్వాల్సి ఉంటుంది. తిరిగి నార్కట్‌పల్లి వద్ద హైదరాబాద్-విజయవాడ హైవే ఎక్కుతారు. ఇదిలావుంటే.. గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 2 కి.మీ. మేర వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీస్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సూర్యాపేట రిలయన్స్ పెట్రోల్ బంకు నుంచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీస్ సిబ్బంది ట్రాఫిక్​ను నియంత్రిస్తున్నారు. జాతర దృష్ట్యా ముందే ట్రాఫిక్‌ను మళ్లించినప్పటికీ… ట్రాఫిక్‌ జాం కావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News