సెక్స్ ట్రాఫికింగ్ కేసులో తమిళనాడు మాజీ ప్రొఫెసర్‌కు 10 ఏళ్ల జైలుశిక్ష

విరుదునగర్ జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్టు న్యాయమూర్తి టీటీ భగవతిఅమ్మాళ్ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు

Update: 2024-04-30 17:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మదురై కామరాజ్ యూనివర్శిటీ (ఎంకేయూ)కి చెందిన నలుగురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవీకి తమిళనాడులోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విరుదునగర్ జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్టు న్యాయమూర్తి టీటీ భగవతిఅమ్మాళ్ మంగళవారం శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. నలుగురు విద్యార్థినుల అక్రమ రవాణాకు ప్రయత్నించిన వ్యవహారంలో ఐదు సెక్షన్ల కింద ఆమెను దోషిగా నిర్ధారించిన స్థానిక కోర్టు శిక్షతో పాటు రూ. 2.45 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో ఓ పురుష అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో సహా మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. అరుప్పుకోట్టైలోని దేవాంగ్ ఆర్ట్స్ కాలేజీలో పనిచేసిన నిర్మలా దేవీ 2018లో అరెస్టయ్యారు. విద్యార్థులతో ఫోన్ సంభాషణలో 'గవర్నర్ స్థాయి' అధికారి కోసం లైంగిక ప్రయోజనాలు అందించాలని కోరడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె రాజ్‌భవన్‌ను ఈ సమస్యలోకి లాగిన నేపథ్యంలో అప్పటి గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఆరోపణలను కొట్టిపారేయడానికి ప్రత్యేకంగా విలేకరుల సమావేశానికి పిలుపునిచ్చారు. ఆమె ముఖాన్ని తాను ఎన్నడూ చూడలేదని స్పష్టత ఇచ్చారు. 

Tags:    

Similar News