విమానంలో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విమానంలో తోటి ప్రయాణికుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేయడం కలకలం రేపింది.

Update: 2023-03-05 06:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్రవిసర్జన వివాదం మరువక ముందే తాజాగా అదే తరహాలో మరొకటి వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి న్యూయార్క్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ‘తాగిన మైకంలో ఉన్న ఓ విద్యార్థి మూత్ర విసర్జన చేశాడు. ఈ క్రమంలో అది తోటి ప్రయాణికుడిపై పడింది’ అని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. నిందితుడు భారత్‌కు చెందిన 21 ఏళ్ల ఆర్య వోహ్రా ఓ అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. మత్తు దిగాక బాధితుడికి ఆ విద్యార్థి క్షమాపణలు చెప్పడంతో అతడి కెరీర్‌ పాడవకూడదనే ఉద్దేశంతో అతడిపై ఫిర్యాదు చేయలేదు.

అయితే, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన విమాన సిబ్బంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం అందించారు. దీంతో విమానం ఢిల్లీలో దిగగానే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఆర్య వోహ్రాని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురి స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. దీంతో, ఆర్యవోహ్రాని అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించింది. కాగా, పౌర విమానయాన నిబంధనల ప్రకారం ఏ ప్రయాణికుడైనా దురుసుగా ప్రవర్తించినట్లు తేలితే క్రిమినల్‌ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అలాగే నిర్ణీత సమయం పాటు విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తారు.

Tags:    

Similar News